
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నుంచి ఖమ్మంలో జిల్లాలో మొదలయ్యే మంత్రి పర్యటన కూసుమంచి, నేలకొండపల్లి మండలాలతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంలో కొనసాగుతుంది. ఆతర్వాత సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, లక్ష్మిదేవిపల్లి మండలు, కొత్తగూడెం కార్పొరేషన్లలో జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు.
సూర్యతండాను సందర్శించిన వైద్యాధికారులు
రఘునాథపాలెం: మండలంలోని సూర్యతండాకు చెందిన పలువురు చిన్నారులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైన విషయమై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వైద్యాధికారి బాలకృష్ణ, ఏఎన్‌ఎం రత్నకుమారి, ఆశా కార్యకర్తలతో కలిసి గ్రామానికి వెళ్లి పరిస్థితులపై ఆరా తీ శారు. అస్వస్థతకు గురైన చిన్నారులను పరీక్షించి మాట్లాడారు. ఇద్దరు చిన్నారులు ఇప్పటికే కోలుకోగా, మరో ఇద్దరు ఖమ్మంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున వేడిచేసి చల్లార్చిన నీరే తాగించా లని, ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ బాలకృష్ణ సూచించారు.
వాజ్‌పేయి
ఆశయ సాధనకు కృషి
ఖమ్మం మామిళ్లగూడెం: మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు కోరారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా శనివారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోటేశ్వరరావు దేశ రాజకీయాలను సన్మార్గంలో నడిపించిన మహానేత వాజ్‌పేయి అని కొనియాడారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు గెంటేల విద్యాసాగర్, అల్లిక అంజయ్య, వేరేల్లి రాజేష్‌గుప్త, మేకల నాగేందర్, కుమిలి శ్రీనివాస్, గడిల నరేష్, రామకృష్ణ, యుగంధర్, రుద్రగాని మాధవ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రికి
వెళ్లొచ్చేసరికి చోరీ
చింతకాని: మండలంలోని వందనం గ్రామానికి షేక్ సైదాబీ ఇంట్లో శనివారం చోరీ జరిగింది. ఆమె ఖమ్మం ఆస్పత్రికి వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడమే కాక బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఖమ్మం నుంచి వచ్చాక చోరీ జరిగినట్లు సైదాబీ గుర్తించగా.. ఆమె కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
ఏడుబావుల వద్ద
జిల్లా యువకుడి గల్లంతు
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల వద్ద శనివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్‌కుమార్ తన బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం చూసేందుకు వచ్చాడు. జలపాతం వద్ద పైన ఉన్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమాన ప్రేమ్ ప్రమాదవశాత్తు జారి బావిలో పడినట్లు తెలుస్తోది. ఆయన సహచరులు ఎంత గాలించినా ప్రేమ్‌కుమార్ ఆచూకీ లభించలేదు. ఇంతలోనే చీకటి పడడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన