● బెళగావి అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
● సీఎం డీకే శివకుమార్ ప్రకటన
● బెంగళూరులో ఆర్భాటంగా కన్నడ రాజ్యోత్సవాలు
● మురిపించిన కళా,
సాంస్కృతిక ప్రదర్శనలు
బనశంకరి: కన్నడ జెండాకు కొత్తరూపం అందించి జాతీయస్థాయి గుర్తింపు కల్పించడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడ పతాకాన్ని ఎగురవేయడం తప్పనిసరి చేస్తామని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఆదివారం కన్నడ రాజ్యోత్సవం రాష్ట్రమంతటా అట్టహాసంగా జరిగింది. బెంగళూరు కంఠీరవ మైదానంలో కన్నడ రాజ్యోత్సవంలో ముఖ్యమంత్రి డీకే పాల్గొని కన్నడ ధ్వజాన్ని ఎగురవేసి విద్యార్థులు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. కన్నడ బావుటాకు జాతీయస్థాయి గుర్తింపు అందించడం గురించి బెళగావి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చించి ప్రకటిస్తామని తెలిపారు. గతంలో నిర్వహించిన మంత్రివర్గంలో కన్నడ బావుటాకు జాతీయస్థాయిలో గుర్తింపు ఇవ్వాలని తీర్మానించి కేంద్రానికి ప్రతిపాదన అందజేశామన్నారు. కానీ మనకు ఇప్పటివరకు గుర్తింపు రాలేదని తెలిపారు. జాతీయ పతాకం గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా కన్నడ జెండా వినియోగం, గుర్తింపు సంరక్షణ గురించి చట్టపరంగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించి, జాతీయ జెండా పక్కన కన్నడ పతాకాన్ని కూడా సరిసమానంగా ఎగురవేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సీఎం కార్యాలయం లోపల మాత్రమే కాకుండా విధానసౌధపైన కూడా కన్నడ బావుటా ఎగురవేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలపై కన్నడజెండాను ఎగురవేయాలని సూచించారు.
నూతన బావుటా ఇలా..
పసుపు, కుంకుమ రంగుతో పాటు మరో రంగు చేర్చి మధ్యలో కన్నడ చిహ్నం అమర్చి కొత్త జెండాను రూపొందించడంపై చర్చ జరిగిందని సీఎం తెలిపారు. జెండా రూపురేఖలపై అందరి సూచనలు తీసుకుని, బెళగావి అసెంబ్లీలోను, ప్రజలతో చర్చించి స్పష్టమైన తీర్మానం తీసుకుంటామని తెలిపారు.
మహోన్నతం కన్నడ భాష
కన్నడిగులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఏదేశంలో ఉన్నప్పటికీ ఊపిరిమాత్రం కన్నడగా ఉండాలని సీఎం డీకే సూచించారు. కన్నడ భాషకు 2 వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది, జాతీయ గుర్తింపు లభించింది, 8 జ్ఞానపీఠ పురస్కారాలు దక్కాయి, భాషను ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది. వేలాదిమంది కన్నడిగులు అనేక రంగాల్లో పేరుప్రతిష్టలు సంపాదించారని చెప్పారు. కన్నడనేల, జలం, సంస్కృతి రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత పాఠశాలలను బెంగళూరు స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యాశాఖ వికాసానికి నడుం బిగించామన్నారు.
క్రీడాకారులకు రూ.కోట్ల సాయం
మన క్రీడాకారులు ఏషియన్ గేమ్స్‌లో 8 పతకాలు సాధించారని, బంగారు పతకం విజేతలకు కోటి రూపాయలు, వెండి పతక విజేతలకు రూ.75 లక్షలు, కాంస్య పతకధారులకు రూ.50 లక్షలు చొప్పున బహుమానం అందించినట్లు సీఎం డీకే చెప్పారు. అలాగే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న 20 మంది క్రీడాకారులకు తలా రూ.5 లక్షలు అందించామని తెలిపారు.
మైసూరులో జరిగిన వేడుకలలో విదేశీ యువతులు
మంత్రముగ్ధుల్ని చేసిన సాంస్కృతిక రూపకాలు
జాతీయ పతాకంతో సమాన స్థాయి
నూతన పథకాలకు నాంది
2047 నాటికి కర్ణాటక కు కొత్తరూపం తీసుకురావాలని లక్ష్యంతో ఉన్నామని సీఎం తెలిపారు. 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థి హస్త, గ్రామానుభవ పథకాలను ప్రారంభించారు. విద్యార్థులకు పల్లెల సందర్శన, పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణ అందిస్తారు. కన్నడ సంస్కృతిని చాటేలా వివిధ పాఠశాలల విద్యార్థులు భవ్యమైన ప్రదర్శనలు ఇచ్చారు. పలు రంగాల్లో సేవలందించినవారికి రాజ్యోత్సవ అవార్డులను అందించారు.


