బైక్‌ను కిందపడేసి.. ఫైనాన్స్‌ సిబ్బంది దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను కిందపడేసి.. ఫైనాన్స్‌ సిబ్బంది దాష్టీకం

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

● భర్త మృతి, భార్యకు గాయాలు

దొడ్డబళ్లాపురం: మైక్రో ఫైనాన్స్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వం చెబుతున్నా తరచూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. నెలమంగల తాలూకా టీ బేగూరు నివాసి మురళి (39) మైక్రో ఫైనాన్స్‌ సిబ్బంది దాడిలో గాయపడి చనిపోయాడు. వివరాలు.. మురళి ఎల్‌అండ్‌టీ మైక్రో ఫైనాన్స్‌లో బైక్‌ కొనడానికి అప్పు తీసుకున్నాడు. మూత్రపిండాల జబ్బుకు తోడు ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో కంతులు కట్టలేదు, దీంతో శుక్రవారంనాడు రికవరీ ఏజెంట్లు బైక్‌ సీజ్‌ చేసేందుకు మురళిని వెంబడించారు. మురళి భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఏజెంట్లు బైక్‌ను కాలితో కొట్టడంతో మురళి, భార్య లత కిందపడి గాయపడ్డారు. మురళి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశాడు. భర్త మృతికి రికవరీ ఏజెంట్లే కారణమని భార్య నెలమంగల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న ఏజెంట్ల కోసం గాలిస్తున్నారు.

అనుమానం పెనుభూతమై.. భార్య నరికివేత

దొడ్డబళ్లాపురం: భార్య శీలాన్ని శంకించిన భర్త ఆమెను కొడవలితో నరికి హత్య చేసిన సంఘటన కలబుర్గి తాలూకా బసవన తాండాలో జరిగింది. వివరాలు.. నామదేవ రాథోడ్‌, నీలాబాయికి 9 ఏళ్ల క్రితం వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. నీలాబాయి కూరగాయల వ్యాపారం చేసేది. ఇటీవల భార్య పట్ల అనుమానం పెంచుకున్న భర్త ఆమె ఫోన్‌కు కాల్‌ వచ్చినా మెసేజ్‌ వచ్చినా సందేహించేవాడు. దీంతో తరచూ గొడవపడేవారు. మద్యానికి బానిసైన నామదేవ నిత్యం తాగివచ్చి భార్యతో గొడవపడేవాడు. శనివారం రాత్రి భార్యతో పోట్లాటకు దిగిన భర్త కొడవలితో ఆమెను నరికి చంపి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు.

బండరాళ్లకు కారు ఢీ..

పీజీ మెడికో మృతి

● నలుగురికి తీవ్ర గాయాలు

శివమొగ్గ: కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బండరాళ్లను ఢీకొనడంతో ఒక వైద్య కళాశాల విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం తీర్థహళ్లి తాలూకాలోని అగుంబె సమీపంలో ఉన్న కావరిహక్లు వద్ద జరిగింది. మృతుడు శివమొగ్గ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎండీ చదువుతున్న చేతన్‌ (28)గా గుర్తించారు. ఐదుగురు మెడికోలు విహారయాత్రకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. తీవ్ర గాయాలైన నలుగురిని ఆ దారిన వెళ్లే ఇతర వాహనదారులు అంబులెన్సులో శివమొగ్గకు పంపించారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఆగుంబె ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, ఎస్‌ఐ శివనగౌడ, పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. పరిశీలించారు.

ప్రియునికి భలే మర్యాద

● స్తంభానికి కట్టేసి దాడి

దొడ్డబళ్లాపురం: ప్రియురాలిని తీసుకెళ్దామని వచ్చిన ప్రియున్ని గ్రామస్తులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన హావేరి జిల్లా రట్టిహళ్లి తాలూకా బత్తికొప్ప గ్రామంలో జరిగింది. వివరాలు.. రట్టిహళ్లికి చెందిన ప్రమోద్‌, బత్తికొప్పవాసి భావన ప్రేమించుకున్నారు. పెద్దలు వ్యతిరేకించడంతో గతంలో ఇద్దరూ ఇళ్లు వదిలి వెళ్లిపోయి రిజిస్టర్‌ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే భావన తల్లిదండ్రులు కుమార్తెకు సర్దిచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకుందాం అని ప్రేయసీ ప్రియుడు సమాచారం ఇచ్చుకున్నారు. ప్రమోద్‌ ఇద్దరు స్నేహితులతో కలిసి బత్తికొప్ప గ్రామానికి వచ్చాడు. ఇది తెలుసుకున్న భావన తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి వారిని స్తంభానికి కట్టేసి దుస్తులు చించేసి తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న హంసభావి పోలీసులు గ్రామానికి వచ్చి ప్రమోద్‌, స్నేహితులను రక్షించారు. దాడిచేసిన వారిపై కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement