● వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం
బనశంకరి: బెంగళూరు నైస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్ ట్యాంకర్ బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఆదివారం కనకపుర రోడ్డు టోల్గేటు నుంచి అంజనాపుర వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంటన్నరకు పైగా ఉవ్వెత్తున మంటలు ఎగసిపడడంతో నైస్ రోడ్డులో అటు ఇటు కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వాహనదారులు ఇబ్బందిపడ్డారు. తలఘట్టపుర పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వస్తున్న ఎంశాండ్ లారీని ఆపి ఆ ఇసుకను చల్లి మంటలు విస్తరించకుండా వేశారు.
హోటల్లో పేలిన సిలిండర్
యశవంతపుర: నగరంలో మెజెస్టిక్లోని ఒక హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. భారీ శబ్ధంతో విస్ఫోటం చెందడంతో చుట్టుపక్కల వారు భయపడ్డారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో గండం తప్పింది.
సిలిండర్ ఘటనలో చిన్నారి మృతి
బనశంకరి: నాయండహళ్లి వినాయకలేఔట్లో రాయచూరు కు చెందిన వలస కూలీ కరిలింగప్ప ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన విషాద దుర్ఘటనలో తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు తీవ్రంగా గాయపడడం తెలిసిందే. వారిలో తల్లీ కూతురు లక్ష్మమ్మ, గీతా వారం కిందట మరణించారు. విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చిన్నారి గిరిజ చనిపోయింది. తండ్రి, ఇద్దరు పిల్లల ఆరోగ్యం విషమంగానే ఉంది.


