దసరా సంబరాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. బన్నిమంటపం మైదానం వినీలాకాశంలో ఆదివారం ఉదయం జరిగిన దసరా వైమానిక ప్రదర్శన మధ్యలోనే నిలిచిపోయింది. భారతీయ వైమానిక దళం సూర్యకిరణ్ విమానాలు బెంగళూరు యలహంక నుంచి చేరుకున్నాయి. ఉదయం 11 గంటలకు 4 బృందాలుగా మొత్తం 9 జెట్ విమానాలు ఎగిరాయి. వేలాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. గాల్లో 5 నిమిషాలు ఉన్నాయో, లేదో.. వెంటనే ముగించుకుని కిందకి వచ్చేశాయి. మేఘావృతం కావడంతో పాటు చిరుజల్లులు కురుస్తుండడమే ఇందుకు కారణమని వాయుసేన సిబ్బంది తెలిపారు. ప్రతికూల వాతావరణంలో విన్యాసాలు చేయకూడదని చెప్పారు. సోమవారం వాతావరణం అనుకూలిస్తే 11 గంటలకు మళ్లీ ఎయిర్ షో జరుగుతుందని తెలిపారు. వేలాది ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు.


