● భకిశ్రద్ధలతో శరన్నవరాత్రులు
● వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవార్లు
బళ్లారి అర్బన్: అవంబావి సీతారామ ఆశ్రమంలో మహాలక్ష్మీదేవి అలంకరణ
బళ్లారి అర్బన్: కాత్యాయిని దేవి
అలంకరణలో కనకదుర్గమ్మ
బళ్లారి అర్బన్/హొసపేటె/రాయచూరు రూరల్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు ఆలయాల్లో అమ్మవార్లకు పూజలు చేశారు. బళ్లారి నగరంలోని కనక దుర్గమ్మను కాత్యాయిని దేవిగా, పటేల్ నగర్ చిన్న దుర్గమ్మను మహాలక్ష్మి దేవిగా, అవంబావి సీతారామ ఆశ్రమంలో మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. కన్యకా పరమేశ్వరిని ధనలక్ష్మిగా, బెంకి మారెమ్మను ముత్యాలతో, మల్నాడు దుర్గమ్మను గాజులతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ఆలయాల వద్ద భక్తులకు ప్రసాదం అందజేశారు. ఇక హంపీలో శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం దుర్గమ్మ దేవిని విశేషంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో ధగధగ మెరుస్తోంది. రాయచూరు జిల్లాలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తడంతో సందడి వాతావరణం నెలకొంది.


