రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన చెరుకు, కంది పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలబుర్గి జిల్లా జేవర్గి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు రాజన గౌడ మాట్లాడుతూ.. విజయపుర, కలబుర్గి జిల్లాలకు చెందిన రైతులు కలసి డిమాండ్ల సాధన కోసం నిరసనకు దిగినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రైతులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రహదారులను దిగ్బంధించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.
‘సర్’ రద్దు చేయకపోతే ఉద్యమిస్తాం
సాక్షి, బళ్లారి: ఓటు హక్కును హరిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని కర్ణాటక దళిత సంఘర్షణ సమితి (డీజీ సాగర్ బృందం) నాయకులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం నగరంలోని జిల్లా అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆ సమితి రాష్ట్ర కన్వీనర్ మానయ్య మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లలో ఆందోళన కలిగిస్తున్న ఎస్ఐఆర్ను రద్దు చేయపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరుపై దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి అనుమానాలు ఉన్నాయన్నారు. ఒక పార్టీకి తొత్తుగా పనిచేసే ఎన్నికల కమిషనర్ ఈ దేశానికి అవసరమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో దళిత సంఘర్షణ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రత
పాటించకపోతే జరిమానా
రాయచూరు రూరల్: విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార్ కాందూ సూచించారు. శుక్రవారం నగరంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ వసతి గృహాల్లో వంటగది, ఆహార పదార్థాల పరిశుభ్రత విషయంలో అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించని వారికి జరిమానా విధించాలని స్పష్టం చేశారు. జిల్లాలో పోషకాహార లోపం సమస్య ఉందని.. దాని నివారణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కృష్ణ, డీహెచ్ఓ నందిత, అధికారులు ప్రవీణ్, సునీత, రవి పాల్గొన్నారు.
పొలాల్లోకి
దూసుకెళ్లిన కారు
ఉరవకొండ: అనంతపురం–బళ్లారి 42వ జాతీయ రహదారిపై చిన్నముస్టూరు సమీపంలో ఓ కారు అదుపు తప్పి పొలాల్లోకి తీసుకెళ్లింది. వివరాలు.. బళ్లారి నుంచి అనంతపురానికి కారులో నలుగురు కుటుంబ సభ్యులు బయలు దేరారు. చిన్నముస్టూరు వద్ద కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి పక్కనే పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం గ్రామస్థుల సహకారంతో కారును బయటకు తీశారు.
చివరి ఆయకట్టుకు
నీరందించాలి
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సమానంగా నీరు అందించాలని దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ నాయక్ సూచించారు. శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి కాలువను పరిశీలించారు. దేవదుర్గ తాలూకాలోని ఆయకట్టు చివరి భూములకు ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు సకాలంలో అందకపోవడంతో రైతులు తమ పొలాల్లో సాగు చేసిన మిరప, పత్తి, వరి పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాలువ ద్వారా నీటిని సమానంగా సరఫరా చేసేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


