రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో రైతులకు వ్యవసాయంపై శాస్త్రవేత్తలు తగిన సలహాలు, సూచనలివ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప పిలుపు ఇచ్చారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రబీ సీజన్ విత్తన దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాబోయే 25 ఏళ్లలో అమెరికాను మించి భారతదేశం ఆహార పదార్థాల ఉత్పత్తిలో ముందంజలోకి వస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా నూతన సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. నేడు పర్యావరణం, జలసంరక్షణ, వాయు సంరక్షణలపై ఆలోచించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ అంశాలపై రైతులకు వివరించాలన్నారు.
పశుగ్రాసాన్ని కాపాడుకోవాలి
హుబ్లీ: జిల్లాలో వర్షాభావంతో రాబోయే రోజుల్లో నీరు, పశుగ్రాసం సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాధికారిణి ఆర్.స్నేహల్ రైతులకు సూచించారు. తమ పొలాల్లో పండించిన మొక్కజొన్న పంటను రైతులు కాపాడుకోవాలన్నారు. వర్షాభావంతో దిగుబడి తగ్గే అవకాశం ఉన్నా పశు, పక్ష్యాదులకు అవసరమైన గ్రాసం, నీరు లభిస్తుందన్నారు. సాధ్యమైనంత వరకు నీటిని, మేతను కాపాడుకోవాలన్నారు. గతంలో కొందరు రైతులు మొక్కజొన్న కోత కోసి సంరక్షించకుండా పొలంలోనే ఎండబెట్టి కాల్చి వేయడం తగదన్నారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పశువులకు మేత దొరకడం కష్టమవుతుందన్నారు. అదనపు గ్రాసం కొనుగోలు చేసే సాధ్యత ఉంటే జిల్లా యంత్రాంగం గోశాలతో పాటు మేత బ్యాంక్‌లను ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడవచ్చన్నారు. రైతులు నిల్వ చేసుకున్న అదనపు గ్రాసాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసే అవకాశం ఉందని జిల్లాధికారిణితో పాటు పశు సంవర్ధక శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వాసంతి మీడియాకు ఇచ్చిన ప్రకటనలో తెలిపారు.
వర్క్‌ఫ్రం హోం సాకుతో
మహిళకు వంచన
హుబ్లీ: ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చని నమ్మించిన ఆన్‌లైన్ వంచకులు నగరానికి చెందిన మహిళ నుంచి రూ.2,40,212లను దోచుకున్నారు. ఐశ్వర్య అనే మహిళ వర్క్‌ఫ్రమ్ హోం గురించి గూగల్‌లో సెర్చ్ చేసి ఓ లింక్‌ను క్లిక్ చేయగా నేహా అనే మహిళ ఫోన్ చేసి తాను మింత్ర కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నానని నమ్మబలికింది. ఈ క్రమంలో వెబ్‌సైట్‌లో వర్క్‌ఫ్రం హోం ద్వారా ఆన్‌లైన్ ప్రోడక్ట్‌లను ఆర్డర్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని మోసగించి తన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని పైమొత్తాన్ని ఆన్‌లైన్ కేటుగాళ్లు తమ ఖాతాలోకి బదలాయించుకున్నారని ఆమె నగర సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళపై లైంగిక దాడి
మరో ఘటనలో 50 ఏళ్ల మహిళపై అత్యాచార ఉదంతం వెలుగు చూసింది. స్థానిక సిద్దారూఢ మఠం పుష్కరణి వెనుక ఉన్న మరుగుదొడ్ల వెనుక గుర్తు తెలియని వ్యక్తి 50 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై పాతహుబ్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
కరువు పరిహారం అందించండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో తీవ్ర కరువు సంభవించినందున రైతులకు కరువు పరిహారం అందించాలని రైతు సంఘం అధ్యక్షుడు శరణప్ప పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతుంటే ప్రజా ప్రతినిధులు మౌనం వహించడం తగదన్నారు. కరువు పరిహారం కింద ఎకరాకు రూ.2500 మాత్రమే ఇవ్వడాన్ని తప్పుబట్టారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, రైతులు పండించిన పంటలకు శాసీ్త్రయ ధరలు ప్రకటించాలన్నారు.
మొక్కల పంపిణీ
హొసపేటె: వడకరాయ ఆలయ సమీపంలో నిర్వహిస్తున్న హిందూ మహా గణపతి ఉత్సవాల్లో భాగంగా శ్యామల సంరక్షణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన హిందూ మహాగణపతి ఉత్సవ కమిటీ నాయకుడు జగదీష్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు అవసరమన్నారు. భూమి, గాలి, నీటి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవాలన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు వీ.నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.


