సాక్షి,బళ్లారి: ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడంతో పాటు అందులో యథేచ్ఛగా షెడ్డు నిర్మించి, అసాంఘీక కార్యకలాపాలు నడిపిస్తున్న ఓ పాత్రికేయుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కురుగోడు పట్టణంలో సర్వే నంబర్–675లో ఎకరం భూమిని అక్రమంగా ఆక్రమించుకుని, షెడ్డును నిర్మించారు. అంతటితో ఆగకుండా అందులోనే రాత్రిళ్లు ఇస్పేట్ జూదం ఆడిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు మెరుపుదాడి చేశారు. శుక్రవారం రాత్రి కురుగోడు పోలీసులు ఇస్పేట్ జూదం ఆడిస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ 25 మందికి పైగా పేకాట ఆడుతూ కనిపించారు. పోలీసులు కూడా ఉన్నఫళంగా వారిని చుట్టుముట్టి ఎక్కడి వారిని అక్కడే ఆపేశారు. పోలీసులు మెరుపు దాడి చేసి దాదాపు రూ.1.25 లక్షల నగదు, ఇస్పేట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. షెడ్డులో యథేచ్ఛగా ఇస్పేట్ జూదం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు జూదం ఆడుతున్న మౌనేష్, అంజినప్ప, నాగరాజు, దొడ్డబసప్ప, రమేష్, నాగేష్, తిమ్మారెడ్డి, లోకేష్, శరణబసవ, వన్నూరుస్వామి, మౌలాసాబ్, నిజాముద్దీన్, శరణగౌడ, కృష్ణ, చంద్ర, గాదిలింగప్ప, రవి,రఘు, కరిబసప్ప, కరేగౌడ, అక్బర్‌లను పోలీసులు అరెస్ట్ చేవారు. ఘటన స్థలంలో ఇస్పేట్ జూదరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ప్రభుత్వ స్థలంలో షెడ్డు నిర్మాణం
జూదగృహంపై పోలీసుల దాడి
23 మంది జూదరుల అరెస్ట్


