శివాజీనగర: భారీ జనసమూహం మధ్య హిందూ గణపతి ఊరేగింపు వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరంలానే 13వ వార్షిక హిందూ మహాగణపతి విగ్రహాన్ని శ్రీపాదగట్టె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్టించారు. శుక్రవారం భారీ పోలీసు భద్రత నడుమ పాదగట్టె ఆంజనేయ ఆలయం నుంచి పట్టణ ప్రధాన వీధి వరకు గణపతి నిమజ్జన ఊరేగింపు జరిగింది. ఎమ్మెల్యే కే.నేమిరాజ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఎస్.భీమానాయక్ మద్దతుదారులు, యువత, ప్రజలు వివిధ సంగీత బృందాల సంగీతానికి, డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుగుణంగా నృత్యం చేశారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశంలో ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకుల ద్వారా సంక్రమించిన హిందూ సంస్కృతి పండుగలు, మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక వారసత్వ సంప్రదాయాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. యువతరం మన గొప్ప వారసత్వ సంస్కృతిని ఆలవర్చుకుని కొనసాగించాలన్నారు. హిరేహడగలి హాలస్వామి, మాజీ ఎమ్మెల్యే ఎస్.భీమానాయక్, జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు బాదామి మృత్యుంజయ, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి శెట్రు, పురపాలక సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.మరిరామణ్ణ, పీఎల్‌డీ బ్యాంకు అధ్యక్షుడు బీడీ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరి గోణిబసప్ప తదితర నాయకులు పాల్గొన్నారు. విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవి ఆధ్వర్యంలో కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, హగరిబొమ్మనహళ్లి సీఐ వికాస్ లమాణితో పాటు కొట్టూరు, మరియమ్మనహళ్లి, తంబ్రహళ్లి ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.


