హొసపేటె: కూడ్లిగి తాలూకా గుడేకోటెలో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాలని కర్ణాటక రక్షణ వేదిక స్వాభిమాని సేన ఆధ్వర్యంలో తహసీల్దార్ రాఘవేంద్రకు వినతిపత్రం సమర్పించారు. సంఘం అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ ఫిర్కా పరిధిలోని గ్రామాల ప్రజలు ఆధార్ నమోదు, సవరణ వంటి నిత్యావసర సేవల కోసం కూడ్లిగి, మొళకాల్మూరు, హొసపేటె వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లి, రోజంతా అక్కడ క్యూలలో నిలబడాల్సి వస్తోంది. దీని వల్ల కూలీలకు, పేద కుటుంబాలకు ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. అంతేకాకుండా కార్యాలయంలో సిబ్బంది కొరత, తాగునీటి వ్యవస్థ, మరుగుదొడ్లు, ప్రహరీ, పరిశుభ్రత వంటి వివిధ సౌకర్యాలను కల్పించాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు. మడివాళ నాగరాజ్, ఎం.రాజన్న, కుంబార రాజన్న, బీ.టీ.రఘు, మహమ్మద్, ఇంద్రేష్, కరిబసప్ప, ఆచారి, ముఖన్ కుబేరప్ప పాల్గొన్నారు.


