హుబ్లీ: విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ధార్వాడ జిల్లా అల్నావర రైల్వే స్టేషన్‌లో 4 గంటలకు పైగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోండ భాగంలో ఏర్పడిన విద్యుత్ సరఫరా సమస్యతో బెంగళూరు–బెళగావి ఎక్స్‌ప్రెస్, అలాగే రాణిచెన్నమ్మ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా రైళ్లను అల్నావర రైల్వే స్టేషన్‌లోనే ఆపేశారు. 4 గంటల నుంచి రెండు రైళ్లు నిలిచి పోయాయి. ఈ రెండు రైళ్లలో 2000లకు పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గోవాలోని లోండలో ఏర్పడిన విద్యుత్ అంతరాయం వల్లే ఈ సమస్య ఏర్పడిందని రైల్వే వర్గాలు తెలిపాయి. రైల్వే సిబ్బంది విద్యుత్ సమస్యలను పరిష్కరించాక రైళ్ల సంచారం యథావిధిగా ప్రారంభమైంది.


