రాయచూరు రూరల్: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గురుమిటకల్ శాసన సభ్యుడు శరణే గౌడ కందూకుర్ పిలుపునిచ్చారు. మంగళవారం గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించడానికి స్థానిక పాఠశాల విద్యాశాఖ, క్రీడా శాఖల ఆధ్వర్యంలో సైదాపూర్‌లో తాలూకా/మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీణల్లో రాణించి పాఠశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు.
కుక్కలు, పశువులను నియంత్రించాలి
రాయచూరు రూరల్: నగరంలో వీధి కుక్కలు, పశువుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్‌డీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నగర సభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌డీపీఐ అధ్యక్షుడు మిర్జా హసన్ బేగ్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడిలో పిల్లలు గాయపడినట్లు తెలిపారు. రహదారులపై పశువులు సంచరించడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అనంతరం నగర సభ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అక్బర్, మతీన్, తౌసిఫ్, మహ్మద్ ఫారూక్, సైదాబేగం, శేఖ్, ఎం.గౌస్ పాల్గొన్నారు.
రైతులకు
న్యాయం చేయాల్సిందే..
రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కోసం భూములు పోగొట్టుకున్న రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి అమరే గౌడ బయ్యాపూర్ డిమాండ్ చేశారు. మంగళవారం హట్టి బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు ఇచ్చి మాట్లాడారు. రైతులు బ్యాంక్‌లో రుణాలు కూడా పొందలేక పోతున్నట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో భూమి వివరాలు హట్టి గణి స్థలం అని నమోదు కావడంతో పంటలు సాగు చేసేందుకు ఇబ్బందిగా మారిందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేపడుతామన్నారు. కార్యక్రమంలో వాలీబాబు, శంకర గౌడ, నారాయణప్ప, సరస్వతి, సంగీత, ఈరమ్మ, నింగప్ప, శివరాజ్, వెంకోబ, శరణప్ప, మల్లికార్జున పాల్గొన్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి
హొసపేటె: నగర శివారులోని భట్రాళ్లి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఉదయం జరిగన ఈ ఘటనలో మృతుడి శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. మృతుడి పేరు, చిరునామా తెలియాల్సి ఉంది. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ప్రమాదవశాత్తూ రైలు కిందపడి చనిపోయాడా అనేది దర్యాప్తులో తెలియనుంది. రైల్వే పోలీసులు, విజయనగర జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.జాహ్నవి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
నేడు వైద్య చికిత్స శిబిరం
హుబ్లీ: వీఏకే ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు వెంకటేష్ కాట్వే జన్మదినం సందర్భంగా బుధవారం నగరంలో వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రోతన రక్త కేంద్రం ముఖ్యుడు దత్తమూర్తి కులకర్ణి తెలిపారు. సదరు ఫౌండేషన్ కేఎల్‌ఈ ఆస్పత్రి రాష్ట్రోతన బ్లడ్‌బ్యాంక్ ఆధ్వర్యంలో స్థానిక దాజిబాన్ పేట దుర్గదేవి కళ్యాణ మంటపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వాతంత్య్ర పోరాటయోధులు వీరయోధులు పద్మశ్రీ గ్రహీతలు, అథ్లెటిక్ విజేతలు, అలాగే పారిశుధ్య కార్మికులకు సన్మానించనున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి పాల్గొంటారు.


