చిక్కపేటేలో అగ్నికీలలు
బనశంకరి: వేసవి రాకముందే అగ్ని ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇటీవల ఓ గోదాము కాలిపోయిన ఘటన మరువకముందే బెంగళూరులో వ్యాపారాలకు నిలయమైన చిక్కపేటేలో ఓ వాణిజ్య కాంప్లెక్స్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుంబారపేటే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడంలో హార్డ్‌వేర్‌దుకాణం, ఫ్యాన్సీ స్టోర్‌లో ఉదయం 7 గంటలకు దట్టమైన పొగ, మంటలు లేచాయి. మొదట హార్డ్‌వేర్ షాపులో పుట్టి ఇతర దుకాణాలకు వ్యాపించి పరిసరాలలో దట్టమైన పొగతో ఆవరించింది. దీంతో స్థానికులు భీతావహులయ్యారు.
కింది అంతస్తులో మొదలై..
ఫైర్ సిబ్బంది 4 వాహనాలతో చేరుకుని 2 గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. మూడంస్తుల కట్టడంలో మొత్తం అనేక అంగళ్లు ఉండగా కింది అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగి పై అంతస్తులకు పాకాయి. హార్డ్‌వేర్ షాపులో షార్ట్ సర్క్యూటే కారణమని, అక్కడ ప్లాస్టిక్ వస్తు సామగ్రి ఉండడంతో అగ్నికీలలు సులభంగా వ్యాపించాయని అనుమానిస్తున్నారు. మంటలు మరింతగా వ్యాపించకుండా ఇతర షాపులను ఖాళీ చేయించారు. దట్టమైన పొగ ఏర్పడడంతో అందరికీ శ్వాస తీసుకోవడం కూడా కష్టతరమైంది. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. హలసూరు గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫైర్ సిబ్బందికి అస్వస్థత
మంటలు అదుపు చేస్తూ పొగ పీల్చడంతో 6 మంది ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక ఇబ్బంది పడడంతో వీరిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ కాంప్లెక్స్ వినోద్ అనే వ్యక్తిది కాగా, మొదటి అంతస్తులో ఫ్యాన్సీ స్టోర్, ప్లాస్టిక్ వస్తువలు అంగడి దగ్ధమయ్యాయి.
ఓ వాణిజ్య కాంప్లెక్స్‌లో మంటలు
పలు షాపులు దగ్ధం


