రూ.2.96 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం
సీజ్ చేసి వెండి సామగ్రి, బంగారు నగలు
సొంతదారుకు అందిస్తున్న కమిషనర్ సీమా
మైసూరు: సైబర్ నేరాలు, స్నాచింగ్‌లు, ఇళ్లలో చోరీలు, గలాటాలు, డ్రగ్స్ కేసులతో సతమతమవుతున్న మైసూరులో పోలీసులు పెద్ద ముందడుగేశారు. భారీగా చోరీలు, దోపిడీల కేసులను ఛేదించారు. మొత్తం రూ.2.96 కోట్ల విలువైన బంగారు నగలు, రూ. 10 లక్షల నగదు, పెద్దసంఖ్యలో ఫోన్లు, వెండి సొత్తు, ద్విచక్ర వాహనాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ తెలిపారు. బుధవారం కమిషనరేట్‌లో చోరీ సొత్తును ప్రదర్శించి యజమానులకు అప్పగించారు. కమిషనర్ సీమా మాట్లాడుతూ నగర పరిధిలోని కువెంపునగర, సరస్వతిపురం, లష్కర్, విద్యారణ్యపురం, విజయనగర, మేటగళ్లి, మండి, నరసింహరాజు పోలీసు స్టేషన్లలో నమోదైన పలు దొంగతనం కేసుల్లో దొంగలను పట్టుకుని సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చామరాజనగరకు చెందిన దొంగ మంజ ఆలయాలలో లూటీలకు పాల్పడుతూ దొరికాడని తెలిపారు.
గూగుల్ మ్యాప్‌లో చూసి లూటీలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక దొంగ గూగుల్ మ్యాప్ ద్వారా మైసూరులో ఒంటరి ఇళ్లను గుర్తించి ఒక్కడే దొంగతనం చేసేవాడని కమిషనర్ చెప్పారు. మరోవైపు నగరంలోని రౌడీ కార్యకలాపాలు సాగిస్తున్న జనతా లేఔట్ నివాసి పి.గణేశ్‌ను అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో 22 డ్రగ్స్ కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, పోయిన సొత్తు అందడంతో సొంతదారులు సంతోషపడ్డారు.
మైసూరు పోలీసుల సాధన
సొంతదారులకు అప్పగింత
రూ.2.96 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం


