దర్శన్.. ఎందరికో ఆదర్శం
మండ్య: ఆ యువకుడు మరణించి కూడా 6 మందిలో జీవిస్తూ ఉన్నట్లే లెక్క. బ్రెయిన్ డెడ్ అయిన అబ్బాయి అవయవాలను అతని కుటుంబం దానం చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. వివరాలు... చిక్కమండ్య గ్రామ యువకుడు దర్శన్ (19) కొన్ని వారాల కిందట బైక్‌పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స తీసుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆకస్మికంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మిమ్స్ వైద్యులు పరిశీలించి బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. విక్టోరియాలో ట్రామా కేర్ సెంటర్‌లో వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
పలువురికి అవయవాలు
అవయవ దానంపై వైద్యులు దర్శన్ కుటుంబసభ్యులకు వివరించారు. వారు అంగీకరించడంతో దర్శన్ దేహంలో నుంచి కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర ముఖ్య అవయవాలను సేకరించారు. డాక్టర్ టీఎస్ కావ్య, డాక్టర్ ఎస్.దీపక్ వైద్య బృందం మంగళవారం రాత్రి శస్త్రచికిత్స చేసి 26 ఏళ్ల వ్యక్తికి దర్శన్ కాలేయాన్ని అమర్చారు. అలాగే మూత్రపిండాలను 29, 38 ఏళ్ల ఇద్దరు వ్యక్తులకు అమర్చారు. హృదయ కవాటాలను మరో ఆస్పత్రికి తరలించారు. 6 మందికి ప్రయోజనం చేకూరినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు జరిపారు.
మండ్య యువకుడు బ్రెయిన్‌డెడ్
అవయవదానం చేసిన కుటుంబం..
దర్శన్.. ఎందరికో ఆదర్శం


