కాలుష్య కోరల్లో కృష్ణమ్మ | - | Sakshi
Sakshi News home page

కాలుష్య కోరల్లో కృష్ణమ్మ

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

కాలుష

కాలుష్య కోరల్లో కృష్ణమ్మ

సాక్షి,బళ్లారి: ఉత్తర కర్ణాటకకు జీవనాడిగా పేరుగాంచిన కృష్ణా నదిలోకి పలు ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలు చేరుతుండటంతో కలుషితం అవుతోంది. పాపనాశిని, పవిత్ర గంగకు సమానంగా భావించే ఈ మహా కృష్ణానది ఇప్పుడు మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థ జలం కలిసి కలుషితం అవుతూ ఇబ్బందులు పడుతోంది. బాగల్‌కోటె జిల్లాతో పాటు ఐదు జిల్లాలకు తాగు, సాగు, వేలాది పశువులకు తాగునీటికి ఆధారమైన ఈ నది నీరు కలుషితం అవుతుండటంతో తాగడానికి పనికిరాకుండా పోతుండటంతో జనం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో పలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం, ఆ నీటిని నదిలోకి వదలడంతో నీరు కలుషితం అవుతున్నాయి. పాలకులు, అధికారులు చోద్యం చూస్తుండటంతో మామూళ్ల మత్తులో జోగుతుండటం ప్రజలకు శాపంగా మారింది. వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహించే కృష్ణమ్మలో ఆరు నెలలు నీరు నిల్వ ఉంటోంది.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం

ఆల్మట్టి ప్రాజెక్టుతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన బ్యారేజీలు, చెక్‌డ్యాంలు ఈ కృష్ణమ్మ ద్వారానే నింపుతుండటం తెలిసిందే. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంపైన కృష్ణానది పొడవునా అక్కడక్కడ ఫ్యాక్టరీలు నిర్మించడంతో ఆ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు, వృథా నీరు యథేచ్ఛగా నదిలోకి వదులుతున్న విషయాన్ని పాలకులు, అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రజలకు శాపంగా మారింది. వ్యర్థాల కారణంగా కృష్ణమ్మ పచ్చగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో నదీ పరివాహక గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి మొదలు కావడంతో తాగునీటి కష్ణాలు కూడా ప్రారంభం కానుండటంతో ఉన్న మంచినీరు కలుషితం అవుతుండటంతో వాటిని ఎలా శుద్ధి చేసుకుని తాగాలి? అని జనం ఆందోళన చెందుతున్నారు. పశువుల సంగతి చెప్పలేని విధంగా మారింది. కలుషిత నీరు తాగి అటు పశువులు కూడా తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నదీ తీరంలోనూ తప్పని నీటి కష్టాలు

ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను పైపులు పెట్టి మరీ నదిలోకి వదులుతుండటం గమనార్హం. నదిలో నీరు తాగడానికి పనికిరాకుండా పోతుండటంతో తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, తద్వారా నీటి కష్టాలు మొదలయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. గత్యంతరం లేక వాటినే తాగితే జ్వరాలు, విరేచనాలు, కడుపు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. కలుషిత నీటిని పంటలకు ఉపయోగించడం వల్ల రైతాంగానికి కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. నేల సారవంతం తగ్గిపోతుందని, పంట దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోతుందని, వర్షాకాలంలో పండిన పంటలు ఈ కలుషిత నీటిని ఉపయోగించడం వల్ల ఎండాకాలం పంటలు పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు తాగునీటి కష్టాలే కాకుండా పశుపక్ష్యాదులకు, పంటలను నాశనం చేస్తున్న కలుషిత నీటికి అడ్డుకట్ట వేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శుద్ధి చేసిన తర్వాతే వ్యర్థాలను వదలాలి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాత కిందకు విడుదల చేయాలి, అలా చేయకుండా పరిశ్రమ నుంచి వెలువడిన వ్యర్థాలను యథావిధిగా విడుదల చేస్తూ అందరికీ కన్నీరు తెప్పిస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కృష్ణమ్మ ఒడిలోకి వస్తున్న వ్యర్థాల గురించి ఆలోచన చేయక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల వల్ల వ్యర్థాలు విపరీతంగా చేరుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా మంచినీటి సమస్య తీరడం లేదని ఆ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న కృష్ణమ్మను మళ్లీ స్వచ్ఛతగా మార్చేందుకు పాలకులు, అధికారులు సమష్టి కృషి చేస్తేనే ఉత్తర కర్ణాటక ప్రజల జీవనాడిని స్వచ్ఛతగా మార్చేందుకు వీలవుతుందని, లేకుంటే ఏటేటా మరింత కాలుష్యపు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణవేణిలో కలుస్తున్న కలుషిత నీరు

పలు ఫ్యాక్టరీల వ్యర్థాలు నదిలోకి

రోగాల బారిన పడుతున్న ప్రజలు

కాలుష్య కోరల్లో కృష్ణమ్మ1
1/2

కాలుష్య కోరల్లో కృష్ణమ్మ

కాలుష్య కోరల్లో కృష్ణమ్మ2
2/2

కాలుష్య కోరల్లో కృష్ణమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement