నేత్రపర్వంగా సిడిబండి రథోత్సవం
సాక్షి,బళ్లారి: కోట్లాది మంది ఆరాధించి కొలిచే నగర ఆదిదేవత, భక్తుల కొంగు బంగారంగా నిలిచిన, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఖ్యాతి పొందిన కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని ఏటా మాదిరిగానే ఈఏడాది కూడా నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయం వద్దకు చేరిన సిడిబండికి మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. సిడిబండికి యుద్ధవీరుని దిష్టిబొమ్మను, కౌల్‌బజార్‌కు చెందిన గాణిగ సమాజానికి చెందిన ఆలయ ప్రముఖుల ఎద్దులను కట్టి లాగారు. కనక దుర్గమ్మ ఆలయం చుట్టు సిడిబండిని ప్రదక్షణలు చేయించారు. ఆలయం ముందు సిడిబండికి పూజలు చేస్తూ టెంకాయలు కొడుతూ, అరటిపండ్లు విసురుతూ మొక్కులు తీర్చుకున్నారు.
ఆకట్టుకున్న శోభాయాత్ర
బెంగళూరు రోడ్డు చిన్న దుర్గమ్మ గుడి నుంచి రాయల్ సర్కిల్ మీదుగా శ్రీకనక దుర్గమ్మ ఆలయం వరకు మహిళలు కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని పూలు, విద్యుత్‌దీపాలతో అలంకరించారు. బంగారు ఆభరణాల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులు బారులు తీరడంతో ఎటుచూసినా ఆలయం చుట్టు భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ప్రతి ఏటా మాదిరిగానే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే మంగళవారం ఆనవాయితీగా నిర్వహించే సిడిబండి రథోత్సవం అంటే నగర వాసులకే కాకుండా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల వాసులకు పండుగే.
ఇంటింటా పండుగ వాతావరణం
ఈ నేపథ్యంలో సిడిబండి రోజున నగరంలో ఇంటింటా పండుగ వాతావరణం నెలకొంది. కనక దుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో ఆలయ పరిసరాలు జన సందోహంతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఆలయం వద్దే కాకుండా, నగరంలోని పలు రోడ్లలో భక్తుల కోసం మజ్జిగ, అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. మోకా రోడ్డు, ఎస్పీ సర్కిల్ రోడ్డు, గాంధీనగర్, రాయల్ సర్కిల్ రోడ్డు ఇలా అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు పిలిచి పిలిచి అన్నదానం, మజ్జిగను అందించి భక్తిని చాటుకున్నారు. ఉదయం నుంచి బారులు తీరి దర్శనం చేసుకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.
జన సందోహంతో కిటకిట
అనంతరం సాయంత్రం సిడిబండి రథోత్సవం తిలకించేందుకు వేలాది మంది జనం తరలిరావడంతో శ్రీకనక దుర్గమ్మ ఆలయం నుంచి ఇటు రాయల్ సర్కిల్, అటు ఎస్పీ సర్కిల్, కప్పగల్ రోడ్డు, తాళూరు రోడ్డు ఇలా ప్రముఖ రహదారులన్నీ జన సందోహంతో నిండిపోయాయి. ఆయా ప్రధాన రహదారుల నుంచి అమ్మవారి ఆలయానికి వాహన రాకపోకలను నిలిపివేసి ప్రజలను మాత్రమే అనుమతించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆలయం చుట్టు పక్కల ఉన్న భవంతులపైకెక్కి జనం సిడిబండి రథోత్సవాన్ని తిలకించారు.
ఆభరణాల అలంకరణతో
అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఆలయానికి పోటెత్తిన
అశేష భక్తజన సందోహం
నేత్రపర్వంగా సిడిబండి రథోత్సవం
నేత్రపర్వంగా సిడిబండి రథోత్సవం


