బడిలో జెండాకు అపచారం
గౌరిబిదనూరు: గణతంత్రంనాడు జాతీయ జెండాకు అపచారం జరిగింది. తాలూకాలోని మంచేనహళ్ళిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా జెండాను తలకిందులుగా కట్టారు. తహసీల్దారు పూర్ణిమ అతిథిగా హాజరై జెండాను ఎగురవేశారు. అయితే తలకిందులుగా ఉండడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. మళ్లీ కిందికి దించి సరిచేసి ఎగురవేశారు. దీనికి కారకుడైన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు తెలిపారు.
బాలునిపై శునకం దాడి
మైసూరు: తమ ఇంటి ఆవరణలోకి వచ్చిన బాలునిపై ఓ పెంపుడు కుక్క దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చామరాజనగర జిల్లా హనూరుతాలూకాలోని మార్తళ్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. ప్రదీప్ కుమార్ కుమారుడు కెవిన్ (11), స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతుండగా కాక్ వెళ్లి జపమాల అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి పడింది. దానిని తీసుకోవడానికి వెళ్లిన కెవిన్ మీద వారి పెంపుడు కుక్క దాడి చేసి కాళ్లు చేతులను కరిచింది. కేకలు వేస్తున్న బాలున్ని తల్లిదండ్రులు కాపాడి కొల్లేగాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా ఈ కుక్క గతంలోనూ కొందరిని కరిచిందని స్థానికులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్..
● ఒకరు దుర్మరణం
బనశంకరి: మద్యం తాగి కారు నడుపుతూ చెట్టును ఢీకొనగా ఒకరు మరణించారు. ఈ ఘటన నగరంలో హెబ్బగోడి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. హెబ్బగోడి నివాసి ప్రశాంత్ (28), రోషన్ హెగ్డే (27) ఆదివారం క్రికెట్ మ్యాచ్ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. తరువాత కారులో ఇళ్లకు బయల్దేరారు. కానీ ఏదో విషయమై కారులోనే వాదులాట మొదలైంది. కారు డ్రైవింగ్ చేస్తున రోషల్ హెగ్డేను ప్రశాంత్ దూషించడంతో అతడు అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ చనిపోగా,, రోషన్‌హెగ్డే తీవ్రంగా గాయపడ్డాడు. కారు ప్రమాద దృశ్యాలు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు నరేగా ఆందోళనలు
● రాజ్‌భవన్ ముట్టడి
● డిప్యూటీ సీఎం వెల్లడి
శివాజీనగర: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం (నరేగా)లో అక్రమాలు జరిగాయని ఆరోపణ చేసేవారు తనతో చర్చకు రావాలని డీసీఎం డీకే శివకుమార్ ప్రతిపక్షాలకు సవాల్ చేశారు. సోమవారం కేపీసీసీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. పేదల కడుపు కొట్టొద్దన్నారు. ఏటా తాము రూ.6 వేల కోట్లతో పనులు చేయించామన్నారు. అక్రమాలు జరిగి ఉంటే అలాంటివారిని జైలుకు పంపండి అని అన్నారు. నరేగాను కాపాడాలని మంగళవారం చలో రాజ్‌భవన్ ఆందోళన చేస్తామని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారన్నారు. ప్రతి జిల్లా, నియోజకవర్గం, తాలూకాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్రలు జరుగుతాయన్నారు.
జయ జయ హనుమా
తుమకూరు: రథసప్తమి వేడుకల్లో భాగంగా తిపటూరు తాలూకా హొన్నవల్లి హోబలి కంబదహళ్లి గ్రామంలో ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. గ్రామ దేవతలైన మణికికెరె కరియమ్మ దేవి, దూతరాయ స్వామి, కెంచరాయ స్వామి, హలేనహళ్లి కరియమ్మ దేవి తదితరుల ఆలయాల్లోనూ విశేష పూజలు చేశారు.
బడిలో జెండాకు అపచారం
బడిలో జెండాకు అపచారం


