విషాదం చిందిన విహారయాత్ర
తుమకూరు: తుమకూరు తాలూకాలోని నేలహల్ సమీపంలోని జాతీయ రహదారి–48పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొని చిక్కుకుపోయింది. ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాలు.. బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే 7 మంది టెక్కీలు వరుస సెలవులు రావడంతో కారులో గోకర్ణ, మురుడేశ్వర్ తదితరాల టూర్‌కి వెళ్లారు. సరదాగా గడిపి తిరుగుముఖం పట్టారు. నేలహల్ వద్ద కారు ముందు వెళ్తున్న లారీని మితిమీరిన వేగంతో ఢీకొట్టింది, కారు దాదాపు లారీలోకి వెళ్లిపోయింది. యూపీ వాసులు అనికేత్ (42), అభిర్ (44), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సన్ముక్తి (35) దుర్మరణం చెందాగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో శిర, తుమకూరు, బెంగళూరుకు వెళ్లే వాహనాలు కొంతసేపు నిలిచిపోయాయి. స్థానికులు, సమీప ఠాణాల పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను బయటకు తీసి తుమకూరు ఆస్పత్రికి తరలించారు. డ్రైవరు నిద్రమత్తే కారణమని అనుమానాలున్నాయి. ఎస్పీ కె.వి. అశోక్ స్థలాన్ని పరిశీలించారు.
తుమకూరు వద్ద వెనుక నుంచి లారీని ఢీకొన్న కారు
ముగ్గురు బెంగళూరు టెక్కీల మృతి
నలుగురికి తీవ్ర గాయాలు
విషాదం చిందిన విహారయాత్ర


