కట్న దాహానికి వివాహిత బలి
బనశంకరి: భర్త వేధింపులను తట్టుకోలేక వివాహిత యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులోని బనశంకరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. యడియూరు చెరువు వద్ద ఉండే గురుప్రసాద్‌తో రెండేళ్ల కిందట తుమకూరు జిల్లా మధిగిరికి చెందిన కీర్తి అలియాస్ లక్ష్మి (24)కి వివాహమైంది. యువతి తల్లిదండ్రులు రూ.35 లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటంగా పెళ్లి చేశారు. కొన్ని నెలల నుంచి భర్త, అత్తమామలు కీర్తిని పుట్టింటి నుంచి మరింత డబ్బు, బంగారం తేవాలని వేధించసాగారు. ఇల్లు కట్టాలని, రూ.10 లక్షలు కావాలని భర్త ఒత్తిడి చేసేవాడు. దీంతో కీర్తి తల్లిదండ్రులు రూ.8 లక్షలు ఇచ్చారు. కానీ వేధింపులు మాత్రం ఆగలేదు. ఈ నరకంపై తల్లికి ఫోన్‌లో చెప్పుకుని కీర్తి బాధపడింది. అన్నీ సర్దుకుంటాయిలే ఆమె ధైర్యం చెప్పింది. విరక్తి చెందిన కీర్తి ఆదివారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు బనశంకరి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆమెది ఆత్మహత్య కాదు, భర్త, అత్తమామలే చంపారని ఆరోపించారు. పోలీసులు భర్త గురుప్రసాద్, అతని కుటుంబీకులపై కేసు నమోదు చేశారు.


