ప్రమాదంలో హిందూ సమాజం
మండ్య: మత విశ్వాసాలపై ఆంక్షలు విధించే వాతావరణం ఏర్పడుతోంది. ఫలితంగా, గణేష చతుర్థి, ఇతరత్రా ఊరేగింపుల సమయంలో హింస జరుగుతోందని బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.ఎల్. సంతోష్ అన్నారు. తాలూకాలోని హనకెరెలె హిందూ సమాజోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హిందువులు జరుపుకొనే గణేష్, హనుమాన్, శారద, దుర్గా మాత ఊరేగింపులు, ఇతర పండుగల వేడుకలపై రాళ్ల దాడులు వంటివి కొనసాగుతున్నాయని పలు జిల్లాల్లో జరిగిన ఘర్షణలను ఉదాహరించారు. దీనికి కారణం హిందువుల జనాభా తగ్గడమేనని చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల సంఖ్య తగ్గింది. దేశంలో కొన్నిచోట్ల హిందువులు మైనారిటీలుగా మారారు, తరువాతి రోజుల్లో హిందువులపై హత్యలు, దారుణాలు పెరిగాయి. అందుకే రాష్ట్రంలో బెంగళూరు, మైసూరుతో సహా అనేకచోట్ల హిందువులు గెలవలేకపోతున్నారు, అక్కడ హిందువులు మైనారిటీగా ఉన్నారు. ఇది ఒక పార్టీ మాత్రమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి అని ఆయన సూచించారు. భారతదేశంలో హిందువుల జనాభా తగ్గకూడదు, ఇటువంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పారు. శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ అనేక దురాగతాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ వంటి కేసులు జరుగుతున్నాయన్నారు. సమాజంలో అనేక విలువలు నాశనం అవుతున్నాయి. సంబంధాలు క్షీణిస్తున్నాయి, పనికిమాలిన అలవాట్లు వస్తున్నాయని వాపోయారు.
బీజేపీ నేత బీఎల్ సంతోష్


