కొబ్బరి.. ఏళ్లతరబడి రాబడి
సాక్షి బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. రైతులు సంప్రదాయ పంటల సాగుకు స్వస్తి పలుకుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వచ్చే వాణిజ్య పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కొబ్బరి బోండాలకు మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో కొబ్బరి సాగుకు శ్రీకారం చుట్టారు. కర్ణాటక రాష్ట్రంలో మండ్య, మైసూరు తదితర జిల్లాల్లో విస్తారంగా కొబ్బరి తోటలు సాగు అవుతాయి. ఆ ప్రాంతాల నుంచి కొబ్బరి బోండాలకు మంచి గిరాకీ లభించేది. ప్రస్తుతం అదే తరహాలో మేలైన హైబ్రీడ్ కొబ్బరి చెట్లను (డీజే రకం) ఉమ్మడి బళ్లారి జిల్లాలో సాగు చేస్తున్నారు. ఒక్కో కొబ్బరి బోండాం నుంచి అర లీటరుకు పైగా నీళ్లు లభిస్తాయి. రోజూ కొబ్బరి బోండాం తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్న తరణంలో కొబ్బరి చెట్లు పెంచిన రైతులు లాభాలు గడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బళ్లారి జిల్లా కంప్లి తాలూకా జీరిగనూరు గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ డీజే రకం కొబ్బరి చెట్లను ఆరు ఎకరాల్లో నాటాడు. మూడున్నర సంవత్సరం నుంచే ఆదాయం ఆర్జిస్తున్నాడు. డ్రిప్ పద్ధతిలో టెంకాయ చెట్లకు నీరు అందిస్తున్నాడు. చెరువులో నీటిని నింపడంతో పాటు, చేపలు వదలడంతో ఏడాదికి రూ.లక్ష ఆదాయం వస్తోందని రైతు చెబుతున్నాడు. ఆరు ఎకరాల్లో డీజే రకం కొబ్బరి మొక్కలు ఎకరానికి 72 చొప్పున నాటగా.. ప్రస్తుతం కాపుకు వచ్చాయి. మొదటి ఏడాదే ప్రతి నెల 2 వేల కొబ్బరి బోండాల దిగుబడి వస్తోంది. ఐదో సంవత్సరం నుంచి ప్రతి నెలా నాలుగు వేల కొబ్బరి బోండాలు కోయవచ్చు. ఒక్కో కొబ్బరి బోండాం రూ.30 చొప్పున విక్రయిస్తున్నాడు. పెట్టుబడులన్నీ పోనూ ప్రతి నెలా రూ.లక్షకు పైగా ఆదాయం పొందుతున్నాడు.
డీజే రకం కొబ్బరి చెట్ల సాగుతో లాభాలు
నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి
కొబ్బరి సాగుకు
ఆసక్తి చూపుతున్న రైతులు
అంతర పంటగా కోకో
కొబ్బరి చెట్లలో అంతర పంటగా 1000 కోకో మొక్కలు నాటాడు. చాక్లెట్ తయారీలో ఉపయోగించే కోకో.. మూడు సంవత్సరాల తరువాత కోతకు వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి 2 కేజీల కోకో గింజలు తీస్తారు. కిలో దాదాపు రూ.700 చొప్పున రైతు విక్రయిస్తున్నాడు. ఒక్కో కోకో చెట్టు నుంచి ఏటా రూ.3,000 వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉమామహేశ్వర నాయుడు రైతు రవీంద్రనాథ్ ఠాగూర్ పొలాన్ని సందర్శించారు. పంటల సాగులో సలహాలు, సూచనలు తీసుకున్నారు. తాను కూడా 100 ఎకరాల్లో కొబ్బరి చెట్లను నాటామని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు. చెట్లు నాటి మూడు సంవత్సరాలు అయిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కొబ్బరి సాగులో అవలంభించిన పద్ధతులు పాటిస్తామన్నారు.
కొబ్బరి.. ఏళ్లతరబడి రాబడి


