రోడ్డు నిర్మాణానికి సర్వే
హొసపేటె: బద్యనాయక తండా నుంచి నగర శివారులో ఉన్న జిల్లా ఆస్పత్రి వరకూ రోడ్డు నిర్మించేందుకు ఆదివారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న బద్యనాయక తండా వాసులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ స్థలం తుంగభద్రకు సంబంధించిన హెచ్‌ఎల్‌సీ కాలువకు చెందినది అని.. సుమారు 80 సంవత్సరాలుగా 70 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నట్లు తెలిపారు. సర్వేకు ముందే ఇళ్లను తొలగించేందుకు వచ్చారా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు కోసం తండాను ఖాళీ చేయిస్తే ఎక్కడ నివసించాలని ప్రశ్నించారు. తహసీల్దార్ శృతి ఎం.మల్లప్ప గౌడ్ స్థానికులకు సర్ది చెప్పారు. ప్రస్తుతం ఇళ్ల తొలగింపునకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి ప్రణాళిక రూపొందించడం లేదని చెప్పారు. ఎన్ని ఇళ్లు ఉన్నాయి అని మాత్రమే సర్వే చేస్తామని తెలిపారు. ఇళ్లు, జనాభా వివరాలతో నివేదికను జిల్లా మేజిస్ట్రేట్, ఎమ్మెల్యేకు సమర్పిస్తామని పేర్కొన్నారు.


