షేర్ల పేరుతో రూ.కోటి సైబర్ లూటీ
బనశంకరి: డిజిటల్ అరెస్టులు అనేవి ఏవీ లేవు, సైబర్ మోసగాళ్ల వలలో పడవద్దు అని ఆర్‌బీఐ, పోలీస్‌శాఖ ఎంత జాగృతం చేసినప్పటికీ అమాయకులు వినిపించుకోవడం లేదు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లల్లా చేసి భారీగా వంచనకు గురవుతున్నారు. అలాంటిదే ఈ సంఘటన. నిర్మల్ హెల్త్ ఆర్కిటెక్ట్ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లోకి విశ్రాంత ఉద్యోగిని చేర్చుకుని రూ.1.01 కోట్లు కొట్టేశారు. బెంగళూరు తిప్పసంద్ర జీవనబీమానగర నివాసి హెచ్.శివప్రసాద్ (74) మోసపోయి తూర్పు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. ఇటీవల ఆయనకు కాల్ చేసిన ఓ యువతి విద్యా కపాడియా అని చెప్పుకుంది, షేరుమార్కెట్‌లో పెట్టుబడిపెడితే పెద్దమొత్తంలో లాభం వస్తుందని తెలిపింది. తరచూ వేర్వేరు నంబర్ల ద్వారా కాల్స్ చేస్తూ అతన్ని పలు వాట్సాప్ గ్రూపుల్లో చేర్పించింది. షేర్ ట్రేడర్స్ పేరుతో వృద్ధునికి మోసగాళ్లు కాల్స్ చేసి పెట్టుబడులగురించి చెప్పేవారు. 2025 నవంబరు 4 నుంచి డిసెంబరు 9 వరకు రూ.1,01,05,100 ను రెండు ఎస్‌బీఐ ఖాతాలు, మరో సహకార బ్యాంకు ఖాతా నుంచి దుండగుల ఖాతాలకు పంపించాడు. 10 అకౌంట్లకు జమ చేయడం గమనార్హం. కొన్నిరోజుల తరువాత అసలు, లాభం ఇవ్వాలని యువతిని అడిగాడు. కానీ మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆమె ఒత్తిడి చేసింది. మోసపోయానని తెలిసి అతడు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
బెంగళూరులో రిటైర్డు ఉద్యోగికి టోకరా


