ప్రేమ వేధింపులకు బలి
మైసూరు: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఓ పోకిరీ నిరంతరం వేధించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంజనగూడులో జరిగింది. దివ్య (17) పీయూసీ ఫస్టియర్ చదువుతోంది, పొరుగూరికి చెందిన ఆదిత్య అనే యువకుడు ప్రేమించాలని వేధించేవాడు. దివ్య తండ్రి గురుమూర్తి ఊరి పెద్దలకు అతని మీద ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆదిత్య ప్రవర్తనను మార్చుకోకపోవడంతో దివ్య భయపడిపోయింది. విరక్తి చెందిన దివ్య ఇంట్లో ఉరి వేసుకుంది. ప్రేమోన్మాదిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బళ్లారిపై సీబీఐ దర్యాప్తు వద్దు
● హోంమంత్రి పరమేశ్వర్
శివాజీనగర: బళ్లారి గొడవపై సీబీఐ తనిఖీ చేపట్టాలనే డిమాండ్లను హోం మంత్రి జీ.పరమేశ్వర్ తిరస్కరించారు. గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ దర్యాప్తు అవసరం లేదు, మన పోలీసులకే దర్యాప్తు సామర్థ్యం ఉంది, వారిచేత కాలేదంటే సీబీఐకి ఇవ్వవచ్చు. అయితే అటువంటి సందర్భం రాలేదు అని చెప్పారు.
హుబ్లీ గొడవపై..
హుబ్లీలో పోలీసులు ఓ మహిళను అరెస్టు సమయంలో వివస్త్రను చేశారనే ఘటనపై పోలీస్ కమిషనర్ వివరణ ఇచ్చారని, అది చాలని తనకు అనిపిస్తోందని అన్నారు. అన్నిటిలోనూ రాజకీయం చేయడం సరికాదని బీజేపీని విమర్శించారు. ఆమే బట్టలు తీసేసుకుందని కమిషనర్ చెప్పాడన్నారు. రాష్ట్రంలోను, బెంగళూరులోను బంగ్లాదేశీయులు ఉంటే వారిని కనిపెట్టి దేశం దాటిస్తామని చెప్పారు. తనను రబ్బరుస్టాంపు హోంమంత్రి అన్న కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి మాటలను స్వీకరిస్తానని అన్నారు. బాధ్యత కలిగిన హోమ్ మంత్రిగా పని చేస్తున్నానని చెప్పారు.
కేఆర్ మార్కెట్‌లో
భూగర్భ పార్కింగ్ పనులు
బనశంకరి: బెంగళూరు కేఆర్ మార్కెట్ కట్టడం బేస్‌మెంట్‌లో చేపడుతున్న పార్కింగ్ లాట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని పాలికె అదనపు కమిషనర్ దల్జీత్‌కుమార్ సూచించారు. గురువారం పనులను పరిశీలించారు. ఇక్కడకు నిత్యం వేలాదిమంది వ్యాపారులు, ప్రజలు వస్తుంటారని, వాహనాల పార్కింగ్‌కు వసతి లేదన్నారు. మార్కెట్ బేస్‌మెంట్‌లో నిర్మిస్తున్న పార్కింగ్ సౌకర్యం అందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, వాననీరు వెళ్లిపోయేలా డ్రైనేజీ ఉంటుందన్నారు. కేఆర్ మార్కెట్ చుట్టుపక్కల స్వచ్ఛత మెరుగుపడిందన్నారు. వ్యాపారస్తులు, ప్రజల కోసం శుభ్రతతో కూడిన మార్కెట్‌గా మార్చాలని సూచించారు.
బైక్‌ను ఎత్తుకెళ్లి దగ్ధం
మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడులో మహదేశ్వర బ్లాక్‌లో సురేష్ అనే కార్మికుడు నెస్లే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంటి ముందు పల్సర్ బైక్‌ను పార్క్ చేశాడు, కానీ అది కనిపించలేదు. ఓ కాలువ పక్కన బైక్ కాలిపోయి ఉంది. పట్టణ పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. గత వారం ఒక యువకుడు తన బైక్‌తో సహా సజీవ దహనమైన సంఘటనకు కొంతదూరంలోనే ఈ బైక్ కాలిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎవరో దుండగులు బైక్‌ను అపహరించి కాల్చివేశారని అనుమానాలున్నాయి.
గంజాయి మత్తులో..
చెయ్యి పోయింది
దొడ్డబళ్లాపురం: గంజాయి మత్తులో రైలుకింద పడి చెయ్యి తెగిపడ్డా యువకుడు ఆస్పత్రికి వెళ్లకుండా రోడ్లమీద తిరిగిన సంఘటన దేవనహళ్లిలో వెలుగు చూసింది. దేవనహళ్లి పట్టణంలోని కుంబార వీధిలో బుధవారం అర్ధరాత్రి ఉత్తర భారతానికి చెందిన వలస కూలీ దిలీప్, గంజాయి మత్తులో సమీపంలోని రైలు పట్టాలపై చెయ్యి పెట్టి పడుకున్నాడు. రైలు ఎడమ చెయ్యి మీద నుంచి వెళ్లడంతో మోచేయి కిందవరకు తెగిపోయింది. గంజాయి మత్తులో నొప్పి తెలియని అతడు మొండి చేతితోనే వీధిలో నడుకుంటు వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసి బెంబేలెత్తిపోయిన స్థానికులు అతనిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా దూకి పరిగెత్తాడు. పోలీసులు వచ్చి గంటసేపు యత్నించి అతనిని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా వైద్యం చేయించుకోకుండా యాగీ చేశాడు. చివరికి అతనికి కట్టుకట్టి చికిత్స చేశారు.
ప్రేమ వేధింపులకు బలి
ప్రేమ వేధింపులకు బలి


