ప్రాణం విలువ రూ.2 లక్షలే
● మాజీ మంత్రి రేవణ్ణ దాష్టీకం
దొడ్డబళ్లాపురం: మాజీ మంత్రి హెచ్‌ఎం రేవణ్ణ కుమారుని కారు ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు, పరిహారం కోరుతూ అతని కుటుంబీకులు ఆయన ఇంటికి రాగా చుక్కెదురైంది. రూ.2 లక్షలు ఇస్తానని, ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వెళ్లిపోండి అని రేవణ్ణ మండిపడ్డారు. గతేడాది డిసెంబరు 1న బెంగళూరు దక్షిణ జిల్లా మాగడి తాలూకా గుడేమారనహళ్లి వద్ద కుమారుడు శశాంక్ కారు ఢీకొని బైకిస్టు రాజేశ్ మరణించాడు. కేసు వద్దని, పరిహారం ఇస్తానని కుటుంబాన్ని పిలిపించుకున్న రేవణ్ణ రూ.2 లక్షలకు బేరం పెట్టారు. కష్టాల్లో ఉన్నామని, చెట్టంత కొడుకును పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. నాకేం సంబంధం, నేను ఇంతే ఇస్తాను, ఇష్టం లేదంటే వెళ్లిపోండి అని దబాయించాడు. మృతుని తండ్రి గుడ్డేగౌడ, తల్లి రత్నమ్మ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తీరుపై ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
క్యాబిన్‌లో మంటలు..
తండ్రీ కూతురు మృతి
మాలూరు: క్యాబిన్ తరహా ఇంటిలో అగ్నిప్రమాదం జరిగి తండ్రీ కూతురు మరణించిన విషాద ఘటన తాలూకాలోని దొమ్మలూరు గ్రామంలో జరిగింది. పంబన్ (44), కుమార్తె యామిని (2) మృతురాలు, వివరాలు.. దొమ్మలూరులోని ఆదిశేష లేఔట్‌లో తమిళనాడులోని ఉతరకెరె గ్రామానికి చెందిన పంబన్ కరెంటు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. లేఔట్‌లోని ఓ క్యాబిన్‌లో నివసిస్తున్నారు. అయితే బుధవారం రాత్రి విద్యుత్ షార్టు సర్క్యూట్ లేదా మరేం కారణమో కానీ క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి. ముగ్గురికీ తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. బెంగుళూరులోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా తండ్రీ కూతురు చనిపోయారు. మాలూరు పోలీసులు లేఔట్ బిల్డర్లు రమేష్, ప్రదీప్ అనే వారిపై కేసు నమోదు చేశారు. రమేష్‌ను అరెస్టు చేయగా ప్రదీప్ పరారయ్యాడు.
మెట్రో వంతెన కోసం 6 వేలకు పైగా చెట్ల కట్ !
శివాజీనగర: మెట్రో రైలు నిర్మాణ పనుల వల్ల భారీసంఖ్యలో చెట్లను కొట్టేయాల్సి వస్తోంది. మెట్రో మూడో దశ పనులకు 6,868 చెట్లను కట్ చేయాలని పాలికె, మెట్రో అధికారులు నిర్ణయించారు. దీనిమీద నగర పర్యావరణ అభిమానులు మండిపడుతున్నారు. సుమారు 37.12 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ మెట్రో రైలు వంతెన పనులు ఈ జూన్‌లో ఆరంభమవుతాయి. మైసూరు రోడ్డు నుంచి జేపీ నగర వరకు వంతెన కట్టే మార్గంలో 1,092 చెట్లను తొలగించాలని నిర్ధారించారు. ఇప్పటికే బెంగళూరులోనూ ఢిల్లీ స్థాయిలో వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ సమస్య మరింత అధికమయ్యే అవకాశముంది.


