అనధికార లేఔట్ల స్థలాలకు ఏ ఖాతా
బనశంకరి: ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో గురువారం విధానసౌధలో మంత్రిమండలి సమావేశం జరిగింది, ఇందులో పలు ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. తుమకూరు, రాయచూరులో కాంగ్రెస్ ఆఫీసులకు స్థలం మంజూరు చేశారు. నగర, స్థానిక సంస్థల పరిధిలో సక్రమ ప్రాధికార ఆమోదం పొందకుండా ఏర్పాటు చేసిన అనధికార లేఔట్లలో బీ–ఖాతా స్థలాలు, కట్టడాలు, అపార్టుమెంట్లు, ప్లాట్లకు ఏ–ఖాతా అందించాలని తీర్మానించారు. దీనివల్ల స్థల యజమానులకు ఊరట కలుగుతుంది.
కొన్ని ముఖ్య నిర్ణయాలు
● కేఎస్‌డీఎల్ బెంగళూరు కాంప్లెక్స్ కోసం రూ.17.70 కోట్లతో ఆధునిక సబ్బుల తయారీ యంత్రం కొనుగోలు
● కోలారు వ్యవసాయ మార్కెట్‌లో రూ.24.96 కోట్ల వ్యయంతో బయో సీఎన్‌జీ కేంద్రం ఏర్పాటు
● కలబుర్గిలో రూ.50 కోట్ల వ్యయంతో మెగా డైరీ నిర్మాణం
● రూ.127 కోట్లతో పీఎం–అబిమ్ పథకం కింద రాష్ట్రంలో 196 రూరల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు
● రూ.40 కోట్లతో చిక్కబళ్లాపుర నంది మెడికల్ కాలేజీకి పరికరాల కొనుగోలు
● కలబుర్గి మహానగర పాలికె పరిధిలో మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీల విగ్రహాల ఏర్పాటుకు ఆమోదం
● రూ.11.03 కోట్లతో ఉత్తర కన్నడ జిల్లా కుమటా తాలూకా దుబ్బనశశి, గంగెకొళ్ల తీరంలో సముద్రకోత నియంత్రణ పనులు
● సత్‌ప్రవర్తన ఆధారంగా 33 మంది ఖైదీల విడుదలకు ఓకే. అలాగే పలు జిల్లాల్లో నూతన భవనాలు, అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.
బీ ఖాతా నుంచి మార్చుకోవచ్చు
కేబినెట్ భేటీలో నిర్ణయం


