గ్రామాభివృద్ధికి సభ్యుల నిర్ణయమే అంతిమం
బళ్లారి రూరల్ : గ్రామాభివృద్దికి ఆ గ్రామ పంచాయతీ సభ్యులే తీర్మానించి తగు చర్యలు తీసుకోవాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున తెలిపారు. దావణగెరె జెడ్పీ, టీపీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మాయకొండ నియోజకవర్గంలోని హొన్నూరు గ్రామంలో పనికి ఆహార పధకం కూలికార్మికులకు ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అవసరమైన పాఠశాలలు, మరుగుదొడ్లు, రోడ్ల నిర్మాణానికి తీర్మానాలు తీసుకొని తగు చర్యలు చేపట్టాలన్నారు. హొన్నూరు గ్రామ పంచాయితీ అధికారులు పనికి ఆహార పథకం అమలు చేయడంలో తమ కర్తవ్యాన్ని నిర్వహించారని కొనియాడారు. ఉత్తమ కూలీకార్మికులకు ఉద్యోగాన్ని కల్పించారన్నారు. పనికి ఆహార పథకం కూలికార్మికులు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగ పడుతోందన్నారు. ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వంలో దివంగత మాజీ ప్రధాని 2005లో ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని ఇప్పటికి కేంద్రప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే బసవంతప్ప, జెడ్పీ సీఈఓ గిత్త మాధవరావు విఠ్ఠల్, జీపీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


