ఘర్షణ కారకులను అరెస్ట్ చేయాలి
సాక్షి,బళ్లారి: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ జరిగే క్రమంలో గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద ఘటనకు మూల కారణమైన వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని డీసీఎంపై మాజీ మంత్రి బీ.శ్రీరాములు మండిపడ్డారు. ఆయన మంగళవారం నగరంలోని గాలి జనార్దనరెడ్డి ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. ఘటనకు కారణమైన నారా భరత్‌రెడ్డితో సీఎం మాట్లాడతారు, డీసీఎం ఆయన్ను పక్కన కూర్చొబెట్టుకుని పత్రికా సమావేశం నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు మృతుడి కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు? ఘటనకు మూల కారకులైన వారిని అరెస్ట్ చేస్తారా, లేదా వేచిచూస్తామన్నారు. దాడి చేయడానికి పెద్ద ఎత్తున గూండాలను తీసుకుని వచ్చి రగడ సృష్టించారు, కాల్పులు జరిపారు, తమపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? దాడికి ప్రతి దాడి చేయడం సహజమేనని మండిపడ్డారు. అయితే ఘర్షణను తాను ఏమాత్రం సమర్థించేది లేదన్నారు.
ఎమ్మెల్యే ఏమైనా సత్యవంతుడా?
ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఏమైనా సత్యవంతుడా? అని ప్రశ్నించారు. తమ వారు ప్రాణ రక్షణ కోసం కట్టెలు, కారంపొడి తెచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన కాంగ్రెస్ వారు దాన్ని బూతద్దంలో చూపడంలో అర్థం లేదన్నారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు కాల్పులు జరపడం ఎక్కడైనా చూశామా? సతీష్‌రెడ్డి గన్‌మెన్ కాల్చడంతోనే వ్యక్తి మృతి చెందారని దర్యాప్తులో కూడా తేలిందన్నారు. వారు ఎవరిని హత్య చేయడానికి కాల్పులు జరిపారో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రైవేటు వ్యక్తులు గన్‌మెన్‌ను కాల్చారంటే వారికి ఎంత ధైర్యం? అని మండిపడ్డారు. శ్రీరాములుపై, గాలి జనార్దనరెడ్డిపై కాల్పులు జరుగుతున్నాయని జనం పరుగెత్తుకుని వచ్చారన్నారు. గాలి జనార్దనరెడ్డి పక్కనే ఉన్నప్పుడు కాల్పులు జరిగాయన్నారు. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారన్నారు. నిన్న సత్యశోధన కమిటీని పంపారు. నేడు మృతుడి కుటుంబ పరామర్శకు శివకుమార్ వచ్చారన్నారు.
ప్రాణరక్షణకు కట్టెలు, కారంపొడి
తెచ్చి ఉండవచ్చు
విలేకరులతో మాజీ మంత్రి
శ్రీరాములు వెల్లడి


