క్రిమినల్ ఎమ్మెల్యేకు డీసీఎం బాసట
సాక్షి, బళ్లారి: తనను పథకం ప్రకారం హత్య చేసేందుకు జరిపిన కాల్పుల్లో దూసుకు వచ్చిన మూడు బుల్లెట్లను పోలీసులకు అప్పగించానని, మరో బుల్లెట్ కూడా బాంబ్ స్క్వాడ్ అధికారులకు లభ్యమైందని, ఘటన జరిగిన రోజున ఐదారుగురు గన్‌మెన్లు ఒక్కొక్కరు ఏడెనిమిది సార్లు దాదాపు 30 నుంచి 40 రౌండ్ల మేర కాల్పులు జరిపారని, ఆ బుల్లెట్లన్నీ దొరకాల్సిన అవసరం ఉందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలోని తన నివాసగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు తమ ఇంటి చుట్టూ సోదాలు చేశారన్నారు. కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం రెండు సార్లకు పైగా జరిపారన్నారు. తనయుడు నారా భరత్‌రెడ్డిని ఈ ఘటన నుంచి రక్షించేందుకు అతని తండ్రి సూర్యనారాయణరెడ్డి వైద్యులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తనకు పక్కా సమాచారం ఉందన్నారు. క్రిమినల్స్ అయినందున ప్రైవేటు గన్‌మెన్లను పెట్టుకుని కాల్పులు జరిపారన్నారు.
బుల్లెట్ వెలికి తీయకుండా అంత్యక్రియలకు ప్లాన్
కాల్పుల్లో మృతి చెందిన రాజశేఖర్ మృతదేహంలో నుంచి బుల్లెట్‌ను వెలికి తీయకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుగా ఏర్పాట్లు చేసుకున్నారన్నారు. అయితే రెండోసారి పోస్టుమార్టం చేయడంతో 12 ఎంఎం బుల్లెట్ బయటకు తీసినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ కేసులో తనను కూడా ఇరికించేందుకు కుట్ర పన్నినా వారి ఆటలు సాగలేదన్నారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బాంబ్ స్క్వాడ్ వచ్చిందంటే తనిఖీ ఎంత వేగవంతంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక పోలీసులను ఎలా నమ్మాలని అన్నారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తి డీ.కే.శివకుమార్ మాటలు చూస్తుంటే పోలీసులు నిష్పక్షపాతంగా తనిఖీ చేస్తారనే నమ్మకం లేదన్నారు. డీకే శివకుమార్ వ్యంగ్యంగా మాట్లాడుతుంటే, ఈయన ముఖ్యమంత్రి అయితే ఇక రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. పోస్టుమార్టం రెండుసార్లు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. పోలీసులను బెదిరించేందుకు డీకేశి ప్రయత్నిస్తున్నారన్నారు. భరత్‌రెడ్డికి డీకే శివకుమార్ అండగా ఉంటానని అనడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు.
30 రౌండ్లకు పైగా ఐదారుగురు గన్‌మెన్లు కాల్పులు జరిపారు
గంగావతి ఎమ్మెల్యే
గాలి జనార్దనరెడ్డి వెల్లడి


