మార్చురీ వద్ద పోలీసుల మోహరింపు
బళ్లారి రూరల్ : నగరంలో గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి నివాసం ముందు గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో మృతి చెందిన కాంగ్రెస్ కార్యర్త రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని బీఎంసీఆర్‌సీ మార్చురీకి తరలించారు. గురువారం అర్థరాత్రి నుంచే మార్చురీ వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. అటు వైపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం ఉదయం దావణగెరె ఐజీ రవికాంతేగౌడ, జిల్లా ఎస్పీ పవన్, అధికారులు రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి, చానాల్ శేఖర్, కాంగ్రెస్ ప్రముఖుడు రవి తదితరులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడి బంధువులను పరామర్శించారు.
బందోబస్తు మధ్య అంత్యక్రియలు
సాక్షి,బళ్లారి: మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేస్తున్న బ్యానర్ల గొడవల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి ప్రైవేటు వ్యక్తి గన్‌మెన్ ద్వారా జరిపిన కాల్పుల్లో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బళ్లారి మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్(బీఎంసీఆర్‌సీ) ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున జనం చేరారు. పోలీసు ఉన్నతాధికారులు వర్తిక కటియార్, రంజిత్ కుమార్, పవన్ నెజ్జూర్ తదితరులతో పాటు కాంగ్రెస్ నేతలు, బీఎంసీఆర్‌సీ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, గణేష్‌లతోపాటు మాజీ బుడా అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి కూడా పాడె మోశారు.
కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం
మృతదేహాన్ని పరిశీలించిన ఐజీ రవికాంతేగౌడ, ఎస్పీ పవన్ నెజ్జూరు
మార్చురీ వద్ద పోలీసుల మోహరింపు


