
వీడియోలు తీసి వికృతానందం
బనశంకరి: ఐటీ సిటీలో రద్దీ ప్రాంతాల్లో యువతులు, మహిళలను ఫోటో, వీడియోలు తీసి అసభ్యకరంగా కనబడేలా ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూ ట్యూబ్‌లలో అప్‌లోడ్ చేసే కామాంధున్ని గురువారం అశోకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. దిలావర్ హుసేన్ (19) నిందితుడు. ఇతను ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్లలో మొబైల్‌ఫోన్‌తో ఫోటోలు, వీడియోలు తీసేవాడు, అసభ్యరీతిలో ఎడిట్ చేసి బెంగళూరు నైట్‌లైఫ్ అని రాసి బెంగాలీ పాటలతో దిల్బర్‌జానీ ఇన్‌స్టా గ్రామ్ పేజీలో పోస్టు చేసేవాడు. అశోకనగర పోలీసులు సుమోటో కేసు నమోదుచేసి ఉన్మాదిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. ఇటీవల ఓ పంజాబీ యువకుడు కూడా కమర్షియల్ వీధిలో ఇలాంటి పనులకు పాల్పడుతూ అరెస్టు కావడం తెలిసిందే. పనీపాటా లేకుండా బెంగళూరులో ఇటువంటి నీచకృత్యాలకు పాల్పడేవారు ఎక్కువైపోయారని ఆందోళన వ్యక్తమవుతోంది.