
బలహీనపడ్డ రుతుపవనాలు
దొడ్డబళ్లాపురం: రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. బుధవారం పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ధారవాడ, హావేరి, కొప్పళ, విజయపుర, బీదర్, కలబుర్గి, రాయచూరు, యాదగిరి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శృంగేరి, బాళెహొన్నూరు, భాగమంగల సిద్ధాపుర, జోయ్డా, కుందాపుర, ధర్మస్థళ, ఉప్పినంగడి, క్యాసల్ రాక్, బెళ్తంగడి, కమ్మరడి, ఆగుంబె, జయపుర, కద్ర, మూడు బిదరె, ఖానాపుర, కోటా, గేరుసొప్ప, సుళ్య, కార్కళ, మాణి, హొన్నావర, సోమవారపేటె, కుశాలనగర,కళస, నాపోక్లు,అజ్జంపుర, కొట్టిగెహార, బండీపురలో మోస్తరు వర్షాలు కురిసాయి.
ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం
దొడ్డబళ్లాపురం: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని,హైకమాండ్ ఇచ్చే ఆదేశాలను తాము గౌరవిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ సింగ్ అన్నారు. ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారనే వార్తలపై స్పందించిన ఆయన.. ఖర్గేకి సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఖర్గే ముఖ్యమంత్రిని ఎన్నిక చేసే స్థానంలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తాము మద్దతు ఇస్తామన్నారు.
5 నుంచి సమ్మెలోకి
రవాణా సంస్థ ఉద్యోగులు
శివాజీనగర: డిమాండ్ల సాధనకు రాష్ట్ర రవాణా సంస్థల ఉద్యోగులు ఆగస్టు 5 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. వేతన బకాయిల చెల్లింపు, సమాన వేతనం, కార్మిక సంఘాల ఎన్నికలు, సస్పెండ్ అయిన ఉద్యోగుల పునర్ నియామకం చేయాలనే డిమాండ్లపై బెంగళూరులోని ఫ్రీడం పార్కులో రవాణా కార్పొరేషన్ల సమాఖ్య, రాష్ట్ర రోడ్డు రవాణా ఉద్యోగుల సమాఖ్యలు ఇప్పటికే ధర్నా చేపట్టాయి.నాలుగు కార్పొరేషన్ల ఉద్యోగులు బుధవారం నుంచి ధర్నాలో పాల్గొన్నాయి. 2020 జనవరి 1 నుంచి అన్వయించే విధంగా వేతన పరిష్కరణ, 38 నెలల పెండింగ్ బకాయి చెల్లింపు, 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా వేతన పరిష్కరణకు సంబంధించి సీఎం అధ్యక్షతన గతంలో జరిగిన సభలో నిర్ణయం తీసుకున్నారని, అయితే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలేదని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి స్పందన కొరవడటంతో ఆగస్టు 5 నుంచి నిరవధిక సమ్మె చేపట్టేందుకు నిర్ధారించినట్లు నేతలు తెలిపారు.
రమ్యకు మళ్లీ అశ్లీల సందేశాలు
యశవంతపుర: నటి రమ్యకు మళ్లీ అశ్లీల సందేశాలు అందాయి. గతంలో అశ్లీల సందేశాలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీసీబీకీ అప్పగించారు. అయినా అశ్లీల సందేశాలు వస్తూనే ఉన్నాయి. వందల కొద్ది సందేశాలు వచ్చాయని, ఇవన్నీ దర్శన్ అభిమానుల నుంచి వచ్చినట్లు నటి రమ్య మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బ్లాక్‌లో ఎరువుల విక్రయాలు
● లోక్‌సభలో గళం విప్పిన ఎంపీ డాక్టర్ సుధాకర్
దొడ్డబళ్లాపురం: కర్ణాటకలో ఎరువులు బ్లాక్ మ్కాట్‌లో విక్రయిస్తున్నారని, ఈ విక్రయాలను అరికట్టేలా రాష్ట్ర సీఎస్‌కి ఆదేశాలు ఇవ్వాలని చిక్కబళ్లాపురం ఎంపీ డా.కే సుధాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లిమెంటులో జీరో అవర్‌లో కన్నడలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు సకాలంలో అందించడంలో ఘోరంగా విఫలమవుతోందన్నారు. దీంతో బ్లాక్ మార్కెట్‌లో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రైతులు దగా పడుతున్నారన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 8.13 లక్షల టన్నుల యూరియా పంపించిందని, అయితే అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రంపై నిందలు మోపుతూ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. కర్ణాటకలో సబ్సిడీ కింద యూరియా రూ.258కు లభించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్లో రూ.500కు విక్రయిస్తున్నారన్నారు. రూ.1200 ఉన్న డీఏపీ రూ.2000ల ధరకు విక్రయిస్తున్నారన్నారు.

బలహీనపడ్డ రుతుపవనాలు