
మరోసారి లోకాయుక్త దాడులు
బనశంకరి: లంచాలు, అక్రమ సంపాదన రుచి మరిగిన ప్రభుత్వ అధికారులపై లోకాయుక్త ఆకస్మిక దాడులు జరిపింది. బెంగళూరు, హాసన్, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. కోట్లాది రూపాయల ఆస్తులు, నగదు, కిలోలకొద్ది బంగారు, వెండి ఆభరణాలు, విలాసవంతమైన భవనాలను గుర్తించింది.
ఎవరెవరిపై దాడులు
● బెంగళూరు నగర రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశ్,
● బీడీఏ కార్యాలయ సీనియర్ హార్టికల్చర్ డైరెక్టర్ ఓంప్రకాష్,
● జాతీయ రహదారులు (ఎన్‌హెచ్‌ఏఐ) హాసన్ విభాగం ఇంజినీర్ జయణ్ణ,
●చిక్కబళ్లాపుర జూనియర్ ఇంజనీర్ ఆంజనేయమూర్తి,
● చిత్రదుర్గ తాలూకా ఆరోగ్యాధికారి వెంకటేశ్‌ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి.
చిత్రదుర్గలో టీహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్‌కు హిరియూరు పట్టణంలోని ఇల్లు, మరో గ్రామంలోని నివాసం, క్లినిక్‌లో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే హైవే ఇంజినీర్ జయణ్ణ నివాసంపై లోకాయుక్త ఎస్‌పీ స్నేహ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. హాసన్ నగరంలో చెన్నపట్టణ హౌసింగ్ బోర్డులో జయణ్ణ నివాసం, భార్య ఇల్లు, హార్డ్‌వేర్ దుకాణం, మరో రెండు చోట్ల సోదాలు సాగించారు. అధికారుల ఇళ్లలో భారీ మొత్తాల్లో భూములు, స్థలాల పత్రాలు లభించాయి. వారం కిందటే 8 మంది అధికారుల ఇళ్లలో లోకాయుక్త ఆకస్మిక దాడులను జరపడం తెలిసిందే. అంతలోపే మరోసారి పంజా విసరడంతో అక్రమార్కుల్లో గుబులు నెలకొంది.
5 మంది అధికారుల ఇళ్లు,
ఆఫీసుల్లో తనిఖీలు
అక్రమ సంపాదన ఫిర్యాదులే కారణం

మరోసారి లోకాయుక్త దాడులు

మరోసారి లోకాయుక్త దాడులు