
హిమవద్ బెట్టపై కుంగిన భూమి
మైసూరు: చామరాజనగర జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న కుండపోత వర్షానికి హిమవద్ గోపాలస్వామి బెట్టలో రోడ్డు మధ్య భూమి కుంగిపోయింది. హిమవద్ గోపాలస్వామి బెట్ట రోడ్డు పెద్ద మలుపు లేదా రాక్షసబండగా పిలిచే చోట భూమి కుంచించుకు పోయింది. గుండ్లుపేటె అధికారులు చేరుకుని పరిశీలించారు. ఆదివారం కూడా గోపాలస్వామి బెట్ట రోడ్డులో ప్రహరీ కూలింది. అటవీ శాఖ సిబ్బంది జేసీబీ ద్వారా రాళ్లు, మట్టిని తొలగించారు. మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నందున రెండు రోజుల పాటు రాకపోకలను నిషేధించారు. ఈ నేపథ్యంలో 29, 30 తేదీల్లో బెట్టపై ఉన్న ఆలయాన్ని మూసివేస్తారని జిల్లాధికారిణి శిల్పానాగ్ తెలిపారు.
పేలుడు వస్తువుల కేసులో ముగ్గురు అరెస్టు
బనశంకరి: కలాసీపాళ్య బస్టాండులో పేలుడు వస్తువులు బ్యాగ్ దొరికిన కేసులో ముగ్గురు వ్యక్తులను కలాసీపాళ్య పోలీసులు అరెస్ట్‌చేశారు. కోలారు జిల్లా బంగారుపేటేకు చెందిన మాదమంగల గణేశ్, మునిరాజ్, శివకుమార్ పట్టుబడినట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ మంగళవారం తెలిపారు. వీరు గనులలో కార్మికులుగా పనిచేస్తారు. ఆరోజు పేలుడు వస్తువులు ఉన్న బ్యాగును తీసుకుని బస్టాండులోని టాయ్‌లెట్‌కు వెళ్లారు. తిరిగి బస్సు కోసం వెళ్తుండగా హోంగార్డు ఉండటాన్ని గమనించి భయపడి అక్కడే బ్యాగును వదిలిపెట్టి వెళ్లిపోయారు. కొళ్లేగాలలో బోర్‌వెల్ తవ్వకాల కోసం తీసుకెళుతున్నట్లు నిందితులు తెలిపారు. వారి నుంచి మరికొన్ని పేలుడు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఇంజినీరుపై లోకాయుక్త దాడి
గౌరిబిదనూరు: అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడనే ఆరోపణపై నగరంలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ జూనియర్ ఇంజనీర్ ఎం ఆంజనేయమూర్తి కార్యాలయం, యలహంక, తుమకూరు, మధుగిరి జక్కూరులలోని ఇళ్లు, వాణిజ్య భవనాలలో లోకాయుక్త దాడులు జరిపింది. ఆఫీసులో సిబ్బంది గాలింపు జరిపి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. చిక్కబళ్ళాపురం లోకాయుక్త ఎస్పీ ఆంటోనీ, సిబ్బంది పాల్గొన్నారు.

హిమవద్ బెట్టపై కుంగిన భూమి