
వృద్ధురాలి డిజిటల్ అరెస్టు
మైసూరు: వారసత్వ నగరి సైబర్ మోసాలకు స్థావరంగా మారింది. మీ ఖాతా ద్వారా మనీ లాండరింగ్ జరిగింది, మీకు రూ.2.5 కోట్లు జమ అయ్యాయని బెదిరించిన దుండగులు మైసూరులో ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేసి రూ.37.82 లక్షలను స్వాహా చేశారు. జేపీ నగర నివాసి అయిన మహిళ (73) బాధితురాలు. ఆమెకు ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. కొంతసేపటికి వీడియో కాల్ చేసిన వంచకులు ముంబైలోని ఎన్‌ఐఏ యూనిట్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. మీ ఖాతా నుంచి మనీ లాండరింగ్ జరిగింది, మీ ఆధార్ నంబరు, బ్యాంకు వివరాలు ఫోటోలను పంపమని సూచించారు.
భయపడిపోయిన ఆ మహిళ వారు అడిగిన దాఖలాలను ఫొటోలు పంపారు. మీ ఖాతాకు పీఎఫ్‌ఐ సంస్థ నుంచి రూ.2.50 కోట్లు జమ అయినట్లు చెప్పారు. ఇది చాలా పెద్ద కేసు అని భయపెట్టడంతో ఆమె బెదిరిపోయి, దీని గురించి తనకేమీ తెలియదని వేడుకుంది. మీ మీద కేసు నమోదైందని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని ఒత్తిడి చేశారు. మీ ఖాతాలో ఉన్న నగదును వేరే ఖాతాలకు బదిలీ చేస్తే, పరిశీలించి మళ్లీ వాపసు చేస్తామని నమ్మించారు. భయాందోళనలో ఉన్న ఆ మహిళ వారు చెప్పిన ఖాతాకు దశల వారీగా మొత్తం రూ.37.82 లక్షల నగదును బదిలీ చేసేసింది. మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించి సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది.
భద్రావతివాసికి రూ.6.83 లక్షలు
శివమొగ్గ: ఫేస్‌బుక్‌లో షేర్ల ప్రకటనను చూసి ఓ వ్యక్తి రూ. 6 లక్షలకు పైగా సమర్పించుకున్నాడు. జిల్లాలోని భద్రావతిలోని హొసమనె బడావణె నివాసి రవీంద్రనాథ్ బాధితుడు. ఫేస్‌బుక్‌ను చూస్తుండగా షేరు మార్కెట్ ప్రకటన వచ్చింది. ఓ యాప్ ద్వారా షేర్లను కొనుగోలు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని ఉంది. సరేనంటూ దశల వారీగా రూ.6,83,127లను ఆన్‌లైన్ ద్వారా పెట్టుబడి పెట్టాడు. అనంతరం నగదు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా యాప్ లాక్ అయింది. మోసాన్ని గ్రహించి శివమొగ్గ సైబర్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాడు.
రూ.37.82 లక్షల వసూలు
మైసూరులో సైబర్ నేరం