
హంతక ఏనుగు బందీ
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పుర తాలూకాలో ఇద్దరిని బలి తీసుకున్న అడవి ఏనుగును ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. బన్నూరు గ్రామ సమీపంలో గత బుధవారం రాత్రి అడవి ఏనుగు సంచరించింది. అనితా అనే కార్మికురాలిని తొండంతో కొట్టి చంపేసింది. ఐదు రోజుల తర్వాత అదే ఏనుగు సుబ్బేగౌడ అనే వ్యక్తిని ఏనుగు కాళ్లతో తొక్కి చంపేసింది. దీంతో హంతక ఏనుగును బంధించాలని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో అటవీశాఖ అధికారులు శివమొగ్గ జిల్లా సక్రేబైలు నుంచి నాలుగు ఏనుగులను తెప్పించి వాటి సహాయంతో హంతక ఏనుగును బంధించడంలో సఫలమయ్యారు. ఏనుగును క్రేన్ సాయంతో లారీలోకి ఎక్కించి అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.