
ధర్మస్థలలో కొనసాగిన గాలింపు
యశవంతపుర: ధర్మస్థలలో వందల సంఖ్యలో శవాలను పూడ్చినట్లు వచ్చిన అరోపణలకు సంబంధించి ఎస్‌ఐటీ బృందం మృతదేహాల కోసం గాలింపు చేపట్టింది. బుధవారం ఉదయం 11 గంటలకు సాక్షిదారుడైన వ్యక్తి చూపించిన రెండు చోట్ల గాలింపు చేపట్టారు. నేత్రావతి నది పక్కలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం 12:30 గంటల వరకు పూడ్చీన శవాల కోసం గాలించారు. ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. అటవీ ప్రదేశం ప్రారంభమైన రెండు జాగాలలో పంచాయతీకి చెందిన 20 మంది కార్మికులు రెండో రోజు ఆరు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పున తోడారు. ఎలాంటి కబేళాలు లభించలేదు. అటవీ ప్రాంతంలో యంత్రాలను ఉపయోగించటం నిషేధం కారణంగా కార్మికులతోనే తోడిస్తున్నారు. పుత్తూరు అటవీశాఖ అధికారి సైల్లావర్గీస్, ఎస్‌ఐటీ ఎస్‌పీ జితేంద్రకుమార్ దయామ అక్కడే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత ఫిర్యాదుదారుడు చూపించిన మూడో జాగాలో కూడా మట్టిని తవ్వారు.
నివృత్త అధికారి పేరు
తను శవాలను పూడ్చటానికి ఒక పోలీసు అధికారి సహకరించినట్లు ఫిర్యాదుదారుడు చెప్పినట్లు తెలిసింది. ఎస్‌ఐటీ అధికారులు అతడిని విచారించగా తనకు ఒక నివృత్త పోలీసు అధికారి సహకరించినట్లు వెల్లడించారు. శవాలను పూడ్చిన సమయంలో ఆ అధికారి తనకు సహకరించినట్లు అతడి పేరును ఎస్‌ఐటీకి తెలియజేశారు. అ అధికారి 1995లో ధర్మస్థల అవుట్‌పోస్ట్ పోలీసు స్టేషన్‌లో పని చేశారని వెల్లడించారు. దీనితో ఎస్‌ఐటీ అధికారులు అక్కడ పని చేసిన పోలీసు అధికారుల జాబితా ఇవ్వాలంటూ దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. సోమవారం 13 జాగాలను గుర్తించి 12 మంది కార్మికులు ఫిర్యాదుదారుడు చెప్పిన జాగాలలో 7 గంటల పాటు శ్రమించినా ఒక ఆధారం కూడా దొరకలేదు.
పాన్‌కార్డు, డెబిట్‌కార్డు, రవిక లభ్యం
మృతదేహాల కోసం మట్టిని తోడుతుండగా పాన్‌కార్డ్, డెబిట్‌కార్డ్, ఒక రవిక(జాకెట్) లభించినట్లు ఫిర్యాదుదారుడి తరపున న్యాయవాది మంజునాథ్ తెలిపారు. ఎస్‌ఐటీ అధికారుల ద్వారా సైట్ సంఖ్య–1లో ఎర్ర రవిక, పాన్‌కార్ట్, ఏటీఎం డెబిట్ కార్డ్ లభించాయి. ఒక కార్డులో పురుషుడి పేరు ఉంది. మరో కార్డ్‌లో లక్ష్మీ అనే మహిళ పేరుంది. ఇలాంటి సాక్ష్యాలు లభించటం వల్ల అనేక సాక్ష్యాలు బయట పడే అవకాశం ఉందని మంజునాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ధర్మస్థలలో కొనసాగిన గాలింపు