
పులుల నేల
బనశంకరి: భారతదేశంలో అడవి రారాజుగా పేరుపొందిన పెద్ద పులుల సంతతి కన్నడనాట అలరాలుతోంది. విశాలమైన అడవులు, జీవ వైవిధ్యం పులుల సంరక్షణకు తోడ్పడుతోంది. పులి శాకాహార జంతువులను వేటాడి ఆహారం సమకూర్చుకుంటుంది. పులులు లేకపోతే శాకాహార జంతువుల సంఖ్య అధికమై అడవిలో సమతుల్యం లోపిస్తుందని నిపుణులు చెబుతారు. జూలై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకొంటారు.
5 రక్షిత అరణ్యాలు
రాష్ట్రంలో చామరాజనగర జిల్లాలో బండీపుర, బీఆర్‌టీ అడవులు, మైసూరు, కొడగు జిల్లాల్లో నాగరహోళె అడవులు, చిక్కమగళూరు వద్ద భద్ర అరణ్యం, ఉత్తర కన్నడ జిల్లాలో కాళీ అడవి పులుల రక్షిత ప్రదేశాలుగా ఉన్నాయి. 2022 లెక్కల ప్రకారం బండీపులో 150, నాగరహొళేలో 140, బీఆర్‌టీలో 37, భద్రలో 28, కాళీలో 17 పులులు ఉన్నట్లు అంచనా. శరీరం పై ఉండే పసుపు, నలుపు చారలను బట్టి పులిని ప్రత్యేకంగా గుర్తిస్తారు. పులులు సంరక్షణ సమయంలో అటవీ సిబ్బంది గాయాల పాలైనా సహించి విధుల్లో పాల్గొంటారు.
రెండవ స్థానంలో కన్నడనాట
ప్రపంచంలోనే అత్యధిక పులులు కలిగిన దేశం భారత్. సుమారు 600 పులులతో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో, 563 పులులతో రెండోస్థానంలో కర్ణాటక ఉండడం గమనార్హం. పెద్ద పులి వారానికి కనీసం 200 కిలోలు మాంసం భుజిస్తుంది. పుట్టిన 3–4 ఏళ్ల కు పరిపక్వతకి వస్తుంది. ఆడ పులి గర్భధారణ సమయం 110 రోజులు. 2 నుంచి 5 కూనలకు జన్మనిస్తుంది. అవి రెండేళ్ల వరకు తల్లి పులి వెంట తిరుగుతూ జీవన మెళకువలను పెంచుకుంటాయి.
మరణాలూ అధికమే
అయితే పులుల మరణాలుకూడా గణనీయంగా ఉంది. ఇటీవల చామరాజనగర జిల్లాలో పురుగుల మందు పెట్టి 5 పులులను చంపడం తెలిసిందే. జాతీయ పులి సంరక్షణా ప్రాధికార (ఎన్‌టీసీఏ) వివరాల ప్రకారం రాష్ట్రంలో 2021లో 15 పులులు, 2022లో 19, 2023లో 12, 2024లో 13, 2025లో 7 నెలల్లో 10 పులులు మృత్యవాత పడ్డాయి.
బండీపుర అడవిలో పులి సఫారీ
రాష్ట్రంలో 563 పెద్దపులులు
దేశంలో రెండవ స్థానం
4 జిల్లాల్లో 5 అరణ్యాల్లో ఆవాసం
మాకు దైవ సమానం
పులిని దేవునిలా పూజిస్తామని, కీర్తిస్తూ జానపద పాటలు పాడతామని, పులితో అవినాభావ సంబంధం ఉందని, తమ ద్వారా పులుల గురించి జ్ఞానాన్ని అటవీశాఖ పరిశోధకులు తెలుసుకోవాలని బిళిగిరి రంగనబెట్ట బుడకట్టు గిరిజన అభివృద్ధి సంఘం కార్యదర్శి డాక్టర్ సీ.మాదేగౌడ తెలిపారు.

పులుల నేల

పులుల నేల

పులుల నేల