
ఎమ్మెల్యేలూ.. బాగున్నారా?
● సీఎం సిద్దు ప్రత్యేక భేటీలు
శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం నుంచి నాలుగు రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలకు శ్రీకారం చుట్టారు. పార్టీ బలోపేతం, నియామకాలు, నిధుల పంపిణీ, అభివృద్ధి పనులు తదితరాలే ఈ చర్చల అజెండా. తొలిరోజు మైసూరు, చామరాజనగర, తుమకూరు, కొడగు, హాసన్, దక్షిణ కన్నడ జిల్లాల ఎమ్మెల్యేలతో విధానసౌధలో భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో 10 నిమిషాల పాటు మాట్లాడినట్లు సమాచారం. ఇటీవలికాలంలో ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం బుజ్జగింపులకు దిగారు. ఇప్పటికే ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నియోజకవర్గ పనులకు రూ.50 కోట్ల నిధులను కేటాయిస్తున్నారు.
సుర్జేవాలా ఎఫెక్టు
రాష్ట్ర ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇటీవల బెంగళూరులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ఆంతరంగిక భేటీలు జరపడం తెలిసిందే. అభివృద్ధి పనులకు డబ్బు లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీఎం తమకు దొరకడం లేదని ఫిర్యాదు చేశారు. దీనివల్ల పార్టీలో అగాథం ఏర్పడుతోందని భావించి వన్ టు వన్ భేటీలకు పెద్దపీట వేశారు.
ఆస్పత్రిలో బాలికపై ఘోరం
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలోని ప్రముఖ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రి కార్మికుడు ఒకరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రికి ఆపరేషన్ జరగాల్సి ఉండడంతో బాలిక తండ్రితో కలిసి వచ్చింది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన ఆస్పత్రిలోని పారిశుధ్య కార్మికుడు సంపత్.. బాలికను బెదిరించి ఓ గదిలోకి తీసికెళ్లి అత్యాచారం జరిపాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఫిర్యాదు చేశారు. కలబుర్గి యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
బ్రోకర్ల చేతిలో ఎరువులు
● బీజేపీ నేత విజయేంద్ర
తుమకూరు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించే ఎరువులను రైతులకు పంపిణీ చేయకపోగా దళారుల ద్వారా బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఎరువుల కోసం రైతులు రోజూ క్యూలలో నిలబడుతున్నారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందుల్లో పడేసిందన్నారు. నగరంలోని బీజిఎస్ సర్కిల్లోని బీజేపీ రైతు మోర్చా ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసారి వానలు బాగా వస్తాయని వాతావరణ శాఖ మూడు నెలల ముందుగానే దీనిని అంచనా వేసింది. పంటల లెక్కలు తీయకపోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రానికి సంవత్సరానికి 6.30 లక్షల టన్నుల యూరియా అవసరం అయితే, కేంద్ర ప్రభుత్వం 8.73 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేసింది. ఈ ఎరువులను రైతులకు ఇవ్వరు కానీ బ్రోకర్‌లు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తారు అని విమర్శించారు. భారీగా సాగిన ర్యాలీలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.