
ధర్మస్థలలో ముమ్మర శోధన
శివాజీనగర: పచ్చని అడవి ప్రాంతాలు, నేత్రావతి నది తీరంలో పోలీసుల కూంబింగ్ జరుగుతోంది. ఎక్కడ మానవ అవశేషాలు దొరుకుతాయా? అని వెయ్యి కళ్లతో శోధిస్తున్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థఽలలో అనేకమంది మృతదేహాలను పూడ్చిపెట్టిన కేసులో సిట్ అధికారులు, పోలీసులు అనుమానిత ప్రాంతాలలో గాలింపు కొనసాగిస్తున్నారు. 13 ప్రదేశాలలో వెలికితీసే కార్యాన్ని చేపట్టారు. అపరిచిత పారిశుధ్య కార్మికుడు ఈ స్థలాలను చూపించాడు, తొలి స్థలం నుంచే తవ్వకాలను ఆరంభించారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ పనుల్లో పాల్గొంటున్నారు.
ఆధారాల సేకరణ
పూడ్చిన స్థలాలు మాత్రమే కాకుండా, కొన్ని సమాధులను కూడా ఫిర్యాదిదారు చూపించాడు. ప్రతి అనుమానిత స్థలంలో మార్కింగ్ చేశారు. ఆధారాలు చెరిగిపోకుండా సాయుధ పోలీసులను కాపలాగా ఉంచారు. ఫోరెన్సిక్ సిబ్బంది, మెడికో– లీగల్ నిపుణులు ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆయా ప్రదేశాల్లో మట్టి నమూనాలను సేకరించారు. డిజిటల్ ఆధారాల కోసం ఫోటోగ్రఫీ, వీడియోలు తీస్తున్నారు. ఫిర్యాదిదారు చెప్పినచోట నిజంగా కళేబరాలను పూడ్చిపెట్టారా, అవి లభ్యమవుతాయా అనేది ఉత్కంఠ అందరిలోను నెలకొంది.
13 ప్రదేశాలలో తవ్వకాలు