ఆర్టీఓ ఇన్‌స్పెక్టర్‌పై వేటుకు ఆదేశం
సాక్షి బళ్లారి: నగరంలోని ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్టీఓ) కార్యాలయంలో తనిఖీకి వెళ్లిన జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణిలతో సరైన విధంగా నడుచుకోకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలో జిల్లాధికారి, ఎస్పీ ఇద్దరూ ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించారు. స్పీడ్ కంట్రోల్‌కు సంబంధించి అధికారులతో చర్చలు జరుగుతున్న సమయంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే టికాణా వేసుకొన్న ఆర్టీఓ ఇన్‌స్పెక్టర్ హేమంత్ కుమార్ నడుచుకొన్న తీరు, మాట్లాడిన పద్ధతి సరిగా లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కాకు గుండీ కూడా పెట్టుకోక పోవడంతో ఎస్పీ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు బటన్ వేసుకొని మాట్లాడాలని మండిపడ్డారు. సినిమాలో విలన్ తరహాలో నడుచుకుంటున్న తీరును నిలదీశారు. దీంతో జిల్లాధికారి మాట్లాడుతూ తక్షణం ఇన్‌స్పెక్టర్ హేమంత్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్టీఓ కార్యాలయాన్ని జిల్లాధికారి, ఎస్పీ సందర్శించడానికి రావడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఆర్టీఓ ఇన్‌స్పెక్టర్ ఉన్నతాధికారులతో నడుచుకొన్న తీరు స్థానికులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. తక్షణం ఆ అధికారిని సస్పెండ్ చేయాలని సూచించిన నేపథ్యంలో సదరు రవాణా శాఖాధికారులు ఆర్టీఓ సీఐని సస్పెండ్ చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.
అధికారులతో ఆర్టీఓ ఇన్‌స్పెక్టర్ దురుసు ప్రవర్తన ఫలితం


