జర్మనీ నుంచి ఇంగ్లండ్‌కు!.. ప్రజ్వల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ | Sakshi
Sakshi News home page

జర్మనీ నుంచి ఇంగ్లండ్‌కు!.. ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

Published Sun, May 19 2024 4:40 AM

Arrest Warrant Issued Against Prajwal Revanna In Kidnapping Case

మకాం మార్చిన ఎంపీ ప్రజ్వల్‌

సిట్‌ అధికారులకు నిరాశ 

ఎంపీ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌

బనశంకరి: హాసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఎప్పుడు వస్తాడనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. గత నెల 27వ తేదీన దేశం విడిచి వెళ్లిన ఎంపీ ఆచూకీ కోసం రాష్ట్ర పోలీసులు, సిట్‌ ముమ్మరంగా గాలిస్తోంది. నగ్న వీడియోలు, లైంగికదాడి కేసులో నిందితుడైన ప్రజ్వల్‌ జర్మనీ నుంచి ఇప్పుడు ఇంగ్లండ్‌కి మకాం మార్చినట్లు గుర్తించారు.  ఈ క్రమంలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. 

ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుసార్లు భారత్‌కు టికెట్లు బుక్‌ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక కోర్టును ఆశ్రయించి సిట్‌ అరెస్టు వారెంటును జారీ చేసింది. 

ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్‌ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.

ఇంగ్లండ్‌లో ఓ భారత పారిశ్రామికవేత్త సహాయంతో ఎంపీ ప్రజ్వల్‌ తన ఇద్దరు స్నేహితులతో కలిసి జర్మనీలోని మ్యూనిచ్‌ నుంచి బ్రిటన్‌కి వెళ్లాడని తెలిసింది. తన జాడ తెలుస్తుందనే భయంతో ప్రజ్వల్‌ గత 15 రోజులుగా కుటుంబంతో కూడా మాట్లాడలేదని తెలిసింది.

జూన్‌ 4 తరువాతే నిర్ణయం
ప్రజ్వల్‌ రేవణ్ణ ఇప్పటికే రెండుసార్లు లుఫ్తాన్సా విమాన టికెట్‌ రద్దు చేసుకున్నారు. మే 3, 15 తేదీన భారత్‌ కు రావడానికి టికెట్‌ బుక్‌ చేసుకుని క్యాన్సిల్‌ చేశారు. దీంతో సిట్‌ అదికారులు ప్రజ్వల్‌ మళ్లీ ఎప్పుడు టికెట్‌ బుక్‌ చేసుకుంటాడా అని నిఘాపెట్టారు. దేశమంతా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4వ తేదీన వెలువడతాయి. ఆ తరువాత పరిణామాలను బట్టి బెంగళూరుకు రావాలా, మరింత ఆలస్యం చేయాలా అనేది ప్రజ్వల్‌ నిర్ణయించుకుంటారు. మరోపక్క వెంటనే రావాలని కుటుంబసభ్యులు ఆయనను కోరినట్లు తెలిసింది.

ఇక.. ప్రజ్వల్‌ బ్యాంకు ఖాతాలను సిట్‌ అధికారులు ఫ్రీజ్‌ చేశారు. ప్ర జ్వల్‌కు చెందిన అన్ని బ్యాంకు అకౌంట్ల సమాచారం సేకరించి వాటిని స్తంభింపజేశారు. ఆయనకు ఏయే ఖాతాల ద్వారా నగదు జమైందో విచారణ చేపట్టారు. విదేశాల్లో గడపాలంటే చాలా డబ్బులు కావాలి కాబట్టి ఆయనకు డబ్బు ఎలా చేరుతోందో కనిపెట్టే పనిలో ఉన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement