చికెన్‌ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్‌.. రూ.30 వేలు పరిహారం!

- - Sakshi

కర్ణాటక: చికెన్‌ ముక్క లేకుండా బిర్యాని తినడం ఎంత అవమానకరమో మాంసప్రియులకు తెలుసు. అయితే మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా?, అలాగే చికెన్‌ బిర్యానీలో చికెన్‌ ఉంటుందా? అని వాదించిన హోటల్‌కు కస్టమర్‌ కోర్టు ద్వారా షాక్‌ ఇచ్చాడు. ముక్క లేకుండా బిర్యాని ఇచ్చిన హోటల్‌ యాజమాన్యంపై కేసు వేసి కోర్టులో గెలిచి పరిహారం సాధించుకున్నాడు.

రూ.30 వేలు ఇవ్వాలని కేసు..
వివరాలు.. బెంగళూరు ఐటీఐ లేఔట్‌ నివాసి కృష్ణప్ప.. మే నెలలో భార్యకు బాగాలేక వంట చేయలేదు. దీంతో స్థానిక ప్రశాంత్‌ హోటల్‌కు వెళ్లి రూ.150 పెట్టి చికెన్‌ బిర్యాని తీసుకున్నాడు. ఇంటికి తీసికెళ్లి పొట్లం విప్పి చూడగా అందులో చికెన్‌ ముక్కలు లేవు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణప్ప వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. సాక్ష్యం కోసం బిర్యాని ఫోటోలు, బిల్లు ఇచ్చాడు. తనకు రూ.30వేల నష్టపరిహారం అడిగాడు. కేసు పరిశీలించిన కోర్టు రూ.1000 పరిహారం, బిర్యానీ ధర రూ.150 తిరిగి ఇవ్వాలని హోటల్‌వారికి ఆదేశించింది. ఈ కేసులో కృష్ణప్ప తానే వాదించుకుని గెలిచాడు.

కోడికూర కోసం భార్య హత్య.. 6 ఏళ్ల జైలు
చికెన్‌కూర వండలేదనే కోపంతో భార్యను హత్య చేసిన కిరాతక భర్తకి కోర్టు 6 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించిన సంఘటన దావణగెరె జిల్లా హరిహరలో చోటుచేసుకుంది. హరిహర తాలూకా మాగనహళ్లికి చెందిన కెంచప్ప భార్య శీలా కోడికూర వండలేదని గొడవ పెట్టుకున్నాడు. కోపం పట్టలేక కత్తితో పొడిచి హత్య చేసాడు. హరిహర గ్రామీణ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విచారణలో కెంచప్ప నేరం రుజువు కావడంతో కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది. కాగా, జైల్లో కెంచప్పకు వారానికి రెండుసార్లు మాంసాహారం లభిస్తుంది.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top