చిల్లర వేషగాళ్ల ట్రాప్‌లో పడొద్దు
డంప్‌యార్డ్ సమస్యపై చెత్త రాజకీయాలు
బీఆర్‌ఎస్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి శంకుస్థాపనలు
కరీంనగర్ కార్పొరేషన్: ‘అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలే.. అధికారం కోల్పోయాక చేయనీస్తలే.. డంప్‌యార్డ్ సమస్య పరిష్కారానికి రూ.17 కోట్లతో టెండర్ నిర్వహిస్తే వివాదాలు సృష్టించి కాంట్రాక్టర్ రాకుండా కుట్ర పన్నుతున్నరు. చిల్లర వేషాలు వేసేవారిని నమ్మొద్దు. ఇలాంటి నీచరాజకీయాలు చేస్తే ప్రజలు ఉరికించి కొడుతరు..’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. ఏడాదిలోపు నగరంలోని అంతర్గత రోడ్లు పూర్తిచేస్తామని, అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. నగరంలోని 46, 26, 25, 23 డివిజన్లలో యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి స్వచ్ఛభారత్ నిధులు రూ.17 కోట్లు, యూసీఎఫ్ స్కీంలో భాగంగా రూ.80 కోట్లతో పనులు మొదలు పెడుతున్నామని తెలిపారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. భీమదేవరపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, జమ్మికుంట, హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మసీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యాకోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. కరీంనగర్‌లో వైద్య కళాశాలను పూర్తి చేస్తామన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, పట్టణాభివృద్ధికి వెయ్యి కొత్త పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


