సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
వరద కాలువ నుంచి రైతులకు సాగునీరందించేందుకు ప్రత్యేక అదనపు కాల్వల(యూటీలు) నిర్మాణానికి భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రామడుగు మండలం షానగర్ వద్ద ఉన్న వరద కాలువ నుంచి దేశరాజ్‌పల్లి వరకు దాదాపు 8.6 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణానికి భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కాలువ నిర్మాణం కోసం షానగర్, వెదిర, కోరటపల్లి, దేశరాజ్‌పల్లి, మోతె గ్రామాల పరిధిలో దాదాపు రైతుల నుంచి 85 ఎకరాలు సేకరణ చేసేందుకు ఆధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ కాలువ నిర్మాణానికి గతంలో ప్రభుత్వం గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించింది. అధికారులు భూసేకరణ ప్రారంభించి 24 ఎకరాలను సేకరించారు. తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్లీ భూసేకరణ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 61 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం పీఎన్ కూడా విడుదల చేసింది. గతంలో కాలువ నిర్మాణం కోసం షానగర్, వెదిర, కోరటపల్లి, మోతె గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు పనులు కూడా నిర్వహించారు. కేవలం దేశరాజ్‌పల్లిలో మాత్రమే భూసేకరణ చేయలేదని అధికారులు వివరించారు. అయితే గతంలో సేకరించిన 24 ఎకరాలు పోను.. ప్రస్తుత నోటిఫికేషన్ ఆధారంగా మిగిలిన 61 ఎకరాలు దేశరాజ్‌పల్లి సహా ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న మిగిలిన గ్రామ పరిధుల నుంచి భూసేకరణ జరగనుంది.
ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణం(85 ఎకరాలు) షానగర్, వెదిర, కోరటపల్లి, దేశరాజ్‌పల్లి, మోతె గ్రామాల పరిధిలోకి వస్తుంది. గతంలో నిలిచిపోయిన ప్రక్రియను ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు కాబట్టి.. ఈ 61 ఎకరాలు దేశరాజ్‌పల్లితోపాటు మిగిలిన 4 గ్రామాల్లో భూముల నుంచి సేకరిస్తున్నారు.
ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించిన అధికారులు.. తదుపరి ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూముల వివరాలు, రైతుల అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ అక్టోబర్ 29న జారీ చేసిన ప్రాథమిక భూసేకరణ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 96 ఎకరాల 13 గుంటల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో గంగాధర మండలం గట్టుబూత్కూర్ గ్రామంలో ఎడమ ప్రధాన కాలువకు 15.23 గుంటలు, కురిక్యాల గ్రామంలో 5.30 గుంటలు, రామడుగు మండలం వెదిర గ్రామంలో 48.14 గుంటల భూమి అవసరమని గుర్తించారు. కుడి ప్రధాన కాలువ నిర్మాణానికి గట్టుబూత్కూర్‌లో 22.02 గుంటలు, వెలిచాల గ్రామంలో 4.24 గుంటల భూమిని సేకరించనున్నారు. ఈ భూములన్నీ ప్రధాన కాలువ–4 నిర్మాణంలో భాగంగా వినియోగించనున్నారు.
కాలువల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో భూములు కోల్పోయే రైతుల్లో పరిహారంపై చర్చ మొదలైంది. గతంలో భూసేకరణ చేసి రైతులకు ప్రతీ ఎకరాకు రూ.25వేల మేర పరిహారం అందజేసినట్లు రైతులు తెలిపారు. తమ విలువైన భూములు పోవడంతో తీవ్రమైన నష్టం జరిగిందని, ప్రభుత్వం తమ పరిస్థితిని ఆలోచించి నాణ్యమైన పరిహారం అందజేయాలని బాధిత రైతులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న భూముల ధరలకు అనుగుణంగా నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన విలువకు, వాస్తవ మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం ఉంటే తమకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు భూములే జీవనాధారంగా ఉన్న కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామసభల సందర్భంగా తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
భూసేకరణలో భాగంగా రెవెన్యూ అధికారులు గుర్తించిన భూముల వివరాలను గ్రామస్తులకు తెలియజేయడంతోపాటు బాధిత రైతుల అభిప్రాయాలను సేకరించేందుకు గ్రామసభలు కీలకం కానున్నాయి. భూముల విస్తీర్ణం, సేకరణకు సంబంధించిన వివరాలు, పరిహార అంశాలపై రైతులకు స్పష్టత రావాల్సి ఉంది. భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనకు సంబంధించి 2013 చట్టంలోని నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అదనపు కలెక్టర్‌ను నిర్వాహకుడిగా నియమించగా.. ప్రత్యేక ఉప కలెక్టర్(భూసేకరణ, పునరావాసం)కు సంబంధిత బాధ్యతలు అప్పగించారు. ఒకవైపు కాలువల నిర్మాణంతో సాగునీటి వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తుండగా.. మరోవైపు భూములు కోల్పోయే రైతులకు ఎంతమేర పరిహారం అందుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. గ్రామసభల నిర్వహణ, రైతుల అభ్యంతరాల స్వీకరణ, పరిహారంపై తీసుకునే నిర్ణయాల ఆధారంగా భూసేకరణ ప్రక్రియ తదుపరి దశకు చేరనుంది.
యూటీ కాలువ కింద మా పంట భూమి 30 గుంటలు పోతుంది. మంచి పత్తి పండే పంట చేను కాలువ కింద పోతుండడంతో ఉపాధి కోల్పోతున్నాం. పరిహారం ప్రభుత్వం గుంటకు రూ.3లక్షల మేర అందజేస్తే బాగుంటుంది. ఈ భూమితోపాటు జాతీయ రహదారి నిర్మాణంలో పంట పొలం కోల్పోతున్నాం. మా కుటుంబానికి తీరని నష్టం కలుగుతుంది. – నరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, వెదిర


