నిండా మునుగుతున్న పత్తి రైతు
మిల్లులు, మార్కెట్లలో అడ్డగోలు దోపిడీ
ఇతర జిల్లాల్లో రూ.9వేలకు పైగా ధర పలుకుతున్నా ఇక్కడింతే..
మద్దతు ధరకు రూ.100 అదనం
కరీంనగర్ అర్బన్:
పత్తి కొనుగోళ్లలో దళారులు ధరను శాసిస్తున్నారు. నెలల తరబడి కష్టపడ్డ కర్షకుడి శ్రమను నిమిషాల్లోనే పిండేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.9,300కు పైగా ధర పలుకుతుండగా ఇక్కడ రైతులకు శఠగోపం పెడుతున్నారు. ఇటీవల జమ్మికుంటలో మార్కెట్ చైర్‌పర్సన్ పత్తి ధర కోతపై నిలదీసిన విషయం తెలిసిందే. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, గోపాల్‌రావుపేట, చొప్పదండిలో ఇదే దుస్థితి. జి ల్లాలో మార్కెట్ కార్యదర్శులతో పాటు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ కరువైంది.
వచ్చేదే అరకొర.. ఖరీదు తాపీగా..
మార్కెట్లతో పాటు జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి తక్కువే. కానీ వ్యాపారుల ధరల నిర్ణయం తాపీగా జరుగుతోంది. ఉదయమే రైతులు మార్కెట్‌కు చేరుతుండగా వ్యాపారులు మధ్యాహ్నం దాటితే గానీ ఖరీదు చేయడం లేదు. అన్ని మార్కెట్లలో కలిపి నిత్యం 1,500 క్వింటాళ్లకు మించి పత్తి రాకపోగా వచ్చిన అరకొర పత్తి కొనుగోలులో ఆలస్యం చేయడం వ్యాపారులకే చెల్లుతోంది. బస్తాలు కోయడం, చేతి స్పర్శతో నాణ్యత చెప్పడం ఆపై కూటమి కట్టిన వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారు. కొంత దిగుబడికి మద్దతు ధరకు రూ.100కు మించి ఖరీదు చేస్తుండగా తదుపరి నీకిది నాకది అంటూ లోలోన కుమ్మకై ్క మద్దతు ధరకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో ధరలను పోల్చితే రూ.500 నుంచి రూ.800 పైగా తక్కువగా ఖరీదు చేస్తున్నారు.
జిన్నింగ్ మిల్లుల్లోనూ దోపిడీ
మార్కెట్లలో పంట ఉత్పత్తులను విక్రయించే రైతులకు నాలుగేళ్లుగా భిన్న పరిస్థితి నెలకొంది. ఈ– నామ్ మార్కెట్ వరకే పరిమితమవగా సిండికెట్ దందా సాగుతోంది. ఇక పత్తి పంటను జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇదేంటని మార్కెట్ అధికారులను ప్రశ్నిస్తే యార్డుకు రైతులు విడిపత్తి తేవడం లేదని, అటే తీసుకెళుతున్నారని మిల్లుల నిర్వాహకులకే వత్తాసు పలుకుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలోనే కొనుగోళ్లు జరిగితే రైతులకు కోతలు లేకుండా లాభం చేకూరనుంది. ఒకవేళ ధర ఇష్టం లేకపోతే అక్కడే ధర వచ్చేవరకు ఉంచుకోవచ్చు. జిన్నింగ్ మిల్లులో ఆ పరిస్థితి లేదు.
రైతులకు భరోసా ఏదీ
ఎకరంన్నర భూమిలో పత్తి వేసిన. వచ్చిన మూడు బస్తాలను మార్కెట్‌కు తీసుకొస్తే ఖరీదు చేయడం ఆలస్యం చేస్తున్నారు. రూ.8300లకు మించి ధర పెట్టడం లేదు. ఇలాగైతే రైతు బతుకు ఎట్లా.. ఎక్కడుంది రైతుకు భరోసా.
– కనకయ్య, రైతు, రామడుగు
పత్రికల్లోనే మద్దతు ధర
కనీస మద్దతు ధర రూ.8667 అని పత్రికల్లో చదవడమే తప్పా మార్కెట్‌లో ధర పెట్టడం లేదు. మంత్రులు, కలెక్టర్ మద్దతు ధరకు అమ్మాలని చెబుతున్నారు. మార్కెట్లో జరుగుతున్నది అందుకు విరుద్ధం. పత్రికల్లో కాదు ఆచరణలో అన్నదాతకు ప్రయోజనం కలగాలి.
– శ్రీనివాస్, నగునూరు, కరీంనగర్ రూరల్


