కేన్సర్‌ కలవరం! | - | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ కలవరం!

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులు

జిల్లాలో 1,092 అనుమానిత కేసులు

102 కేన్సర్‌ నిర్ధారణ కేసులకు చికిత్స

అనధికారికంగా రెండింతలుండే అవకాశం

తొలి దశలో గుర్తిస్తే మేలంటున్న వైద్యులు

కరీంనగర్‌:

జిల్లాలో కేన్సర్‌ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ కేసులు అధికంగా నమోదవడం కలవరపెడుతోంది. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద 2023 మార్చి 8 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో వెలుగుచూసిన గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1,092 అనుమానిత కేన్సర్‌ కేసులను గుర్తించగా, 102 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు సమాచారం.

మహిళల్లోనే అధికం..

గుర్తించిన అనుమానిత కేసుల్లో మహిళల సంఖ్య అధికంగా ఉంది. 369 మందిలో బ్రెస్ట్‌ కేన్సర్‌ అనుమానిత లక్షణాలు గుర్తించగా, 65 మందికి నిర్ధారణ అయింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు సంబంధించి 263 అనుమానిత కేసులు గుర్తించగా, 21 మందికి నిర్ధారణ అయింది. నోటి కేన్సర్‌కు సంబంధించి 460 అనుమానిత కేసులు కాగా, 10 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇవి అధికారిక లెక్కలు.. అనధికారికంగా మరో రెండింతలు ఉన్నట్లు తెలుస్తోంది.

పొంచి ఉన్న ముప్పు

మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు, మద్యపానం, పొగాకు, గుట్కా వినియోగం కేన్సర్‌ ముప్పును పెంచుతున్నాయి. పొగాకుతో నోటి కేన్సర్‌, ధూమపానం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. జన్యుపరమైన అంశాలు, వయసు, హార్మోన్ల మార్పులు, కొన్ని వైరస్‌ల ప్రభావం వ్యాధికి కారణమవుతాయి. దీర్ఘకాలిక దగ్గు, అసాధారణ రక్తస్రావం, ఆకస్మికంగా బరువు తగ్గడం, తగ్గని నొప్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ముందస్తు గుర్తింపుతోనే ప్రాణ రక్షణ

కేన్సర్‌ను మొదటి, రెండో దశల్లో గుర్తిస్తే చికిత్సతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. స్క్రీనింగ్‌లో అనుమానిత లక్షణాలు కనిపిస్తే బయాప్సీ తదితర నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లకు సంబంధించి మహిళలు వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ టీకా కీలకం. అర్హులైన బాలికలకు నిర్ణీత వయసులో టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో వ్యాధి ముప్పును తగ్గించవచ్చని చెబుతున్నారు.

మెరుగైన వైద్యసేవలు

కేన్సర్‌ చికిత్సలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ ప్రధానమైనవి. వీటితోపాటు ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో డేకేర్‌ కీమోథెరపీ, నొప్పి నివారణ, పాలియేటివ్‌ కేర్‌ సేవలు అందిస్తున్నాం. బాధితులకు మానసిక ధైర్యం కల్పిస్తూ, నిరంతర వైద్య పర్యవేక్షణ, ఫాలోఅప్‌ చేస్తున్నాం. కేన్సర్‌ అంటే మరణశాసనం కాదని, ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సతో వ్యాధిని జయించవచ్చనే అవగాహన ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. – డాక్టర్‌ వీరారెడ్డి,

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement