ఇల్లంతకుంట(సిరిసిల్ల): ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన కల్యాడపు హనుమవ్వ (80) వృద్ధురాలు సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమవ్వకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఒక కొడుకు రేపాకలోనే అనారోగ్యంగా అచేతనంగా ఉంటాడు. ఒక కొడుకు చనిపోగా, మిగతా ముగ్గురు ముంబైకి ఉపాధి నిమిత్తం వెళ్లారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమవ్వ సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి తంగళ్లపల్లిలోని కూతురుకు తెలియజేశారు. మృతురాలి కూతురు ఆది లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు.
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో ఆగిఉన్న లారీని ఢీకొని చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన తమ్మనవేని శ్రీనాథ్(27) మరణించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై, స్థానికుల కథనం ప్రకారంగా.. రాగంపేట గ్రామానికి చెందిన తమ్మనవేని లక్ష్మి– మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శ్రీనాథ్ మంచిర్యాల జిల్లా చెన్నూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగి. రెండు రోజుల క్రితం మరోబ్యాంకులో ఉద్యోగం సాధించాడు. జగిత్యాలలో పనిచేస్తూ రాగంపేటలోని తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిపోతున్నాడు. ఈ క్రమంలో విధులు ముగించుకుని సోమవారం సాయంత్రం స్వగ్రామానికి బయలు దేరాడు. ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోకి రాగానే రోడ్డుపక్కన నిర్లక్ష్యంగా పార్కింగ్ చేసిన మహారాష్ట్రకు చెందిన లారీని చీకట్లో కనిపించక ఢీకొన్నాడు. తీవ్రగాయాలు కాగా 108లో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
కాజీపేట: కాజీపేట ఈఎల్‌ఎస్ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం రాత్రి రైల్వే ఉద్యోగి దూలం శ్రీనివాస్ (45) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీనివాస్ కొద్దిరోజులుగా విధులకు హాజరుకాకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. రామగుండంలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌పై అధికారులు క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
వృద్ధురాలి ఆత్మహత్య
ఆగిఉన్న లారీని ఢీకొని యువకుడు మృతి